Telugu Global
Andhra Pradesh

రోడ్లు బాగు చేస్తున్నా ఆగని విష ప్రచారం.. సీఎం జగన్ వ్యాఖ్యలు

కొన్ని మీడియా సంస్థలు కావాలని విష ప్రచారం చేస్తున్నాయన్నారు. అందుకే అధికారులు నాడు - నేడు శీర్షిక కింద బాగైన రోడ్లు, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

రోడ్లు బాగు చేస్తున్నా ఆగని విష ప్రచారం.. సీఎం జగన్ వ్యాఖ్యలు
X

ఏపీలోని రోడ్లపై కొన్ని నెలల కిందటి వరకు మీడియాలో పుంకాను పుంకాలుగా వార్తలు వచ్చాయి. అక్కడ రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయని, కొత్త రోడ్ల ఊసే లేదని, ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని లెక్కలేనన్ని వార్తలు ప్రచురితం అయ్యాయి. అయితే వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చేసరికే ఏపీలో రోడ్లు చాలాచోట్ల పాడయ్యాయి. దానికి తోడు వరుసగా రెండేళ్లు భారీ వర్షాలు కురవడంతో రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు, కొత్త రోడ్లు వేసేందుకు అవకాశం లేకుండా పోయింది.

కొన్నిచోట్ల రోడ్లకు మరమ్మతులు చేసినా మళ్లీ అవి వెంటనే పాడయ్యేవి. దీనిని సాకుగా తీసుకొని కొన్ని మీడియా సంస్థలు రాష్ట్రంలో రోడ్ల బాగు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేనట్లు ప్రచారం చేశాయి. అయితే ఇటీవలి కాలంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త రోడ్లు వేసింది. మరమ్మతులకు గురైన రోడ్లను బాగు చేసింది.

అయితే విచిత్రంగా రోడ్లు బాగా లేనప్పుడు కుప్పలు కుప్పలుగా వార్తలు రాసిన కొన్ని మీడియా సంస్థలు రోడ్లు బాగు అయిన‌ తర్వాత కనీసం కొత్త రోడ్లు వేసినట్లు కానీ, మరమ్మతులు చేపట్టినట్లు కానీ వార్తలు ప్రచురించలేదు. దీనిపై తాజాగా ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రోడ్లను బాగు చేస్తున్నా కొన్ని మీడియా సంస్థల విష ప్రచారం మాత్రం ఆగడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

సోమవారం ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రోడ్లు, భవనాల శాఖపై పంచాయతీరాజ్, పురపాలక, గిరిజన, సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల వద్ద ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నిటిని బాగు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కొత్తగా వేసిన రోడ్లు రెండేళ్లకే మరమ్మతులకు గురవకుండా ఏడేళ్లపాటు ఉండేలా నాణ్యతతో వేయాల‌ని సూచించారు. దీనివల్ల రోడ్ల నిర్వహణ సజావుగా సాగుతుందన్నారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని ప్రధాన రోడ్లను బాగు చేయాలని ఆయన సూచించారు.

బాగైన రోడ్ల వివరాలు నాడు - నేడు ద్వారా వివరించండి

రాష్ట్రంలో కొత్తగా వేసిన రోడ్లు, మరమ్మతులు పూర్తయిన రోడ్ల వివరాలు నాడు - నేడు శీర్షికన ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కోట్లు ఖర్చుపెట్టి రోడ్లు బాగు చేస్తున్నా ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం జరుగుతోందన్నారు. కొన్ని మీడియా సంస్థలు కావాలని విష ప్రచారం చేస్తున్నాయన్నారు. అందుకే అధికారులు నాడు - నేడు శీర్షిక కింద బాగైన రోడ్లు, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

రోడ్ల మరమ్మతుల కోసం ప్రత్యేక యాప్

రాష్ట్రంలో రోడ్ల మరమ్మతు కోసం ముఖ్యమంత్రి జగన్ 'ఏపీ సీఎం ఎంఎస్' అనే యాప్‌ని ప్రారంభించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో రోడ్లు పాడై ఉంటే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. గుంతలు పడ్డ ఫొటోలు కూడా యాప్‌లో అప్లోడ్ చేయవచ్చన్నారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు పాడైన రోడ్లను బాగు చేస్తామని సీఎం జగన్ తెలిపారు. ఏపీ సీఎం ఎంఎస్ యాప్ ద్వారా ఏ రోడ్డుకు సంబంధించి అయితే ఫిర్యాదు అందుతుందో ఆ రోడ్డును 60 రోజుల్లోగా బాగు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.

First Published:  23 Jan 2023 1:17 PM GMT
Next Story