Telugu Global
Andhra Pradesh

రేపు పార్టీ క్యాడ‌ర్‌తో జగన్ కీలక భేటీ..

2014-19లో అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు చేసిన అవినీతిని జనాలకు వివరించాలని నేతలకు జగన్ చెప్పబోతున్నారు. స్కాముల్లో సాంకేతిక అంశాలేమిటి..? రాజకీయ కారణాలు ఏమిటనే విషయాన్ని వివరిస్తారని పార్టీ వర్గాల సమాచారం.

రేపు పార్టీ క్యాడ‌ర్‌తో జగన్ కీలక భేటీ..
X

జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన కీలకమైన భేటీ జరగబోతోంది. విజయవాడలోని మున్సిపల్ గ్రౌండ్ లో జరగబోతున్న సమావేశంలో సుమారు 9 వేలమంది నేతలు పాల్గొంటారని అంచనా. ఈ సమావేశానికి మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, పార్టీ అనుబంధ సంఘాల ముఖ్యనేతలుతో పాటు నియోజకవర్గ, మండల స్ధాయిలో ద్వితీయ శ్రేణి నేతలు కూడా రాబోతున్నారు. ఎన్నికలు మరో ఎనిమిది నెలల్లో జరగబోతున్న నేప‌థ్యంలో ఈ సమావేశంలో వివిధ అంశాలపై జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు.

జరగబోయే సమావేశాన్ని ఒకరకంగా ఎన్నికల సన్నద్ధ సమావేశమనే చెప్పాలి. ప్రస్తుతం రాజకీయంగా హాట్ టాపిక్ గా ఉన్న అనేక అంశాలపై సమావేశంలో స్పష్టత ఇవ్వబోతున్నారు. ఇందులో స్కిల్ స్కామ్ లో చంద్రబాబును సీఐడీ ఎందుకు అరెస్టు చేసిందనే విషయమై వివరించబోతున్నారు. కోర్టు రిమాండు విధించిన కారణాలను కూడా డీటైల్డ్ గా చెప్పబోతున్నారట. ఇదే కాకుండా ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాముల్లో చంద్రబాబు పాత్రతో పాటు టీడీపీలోని కీలక నేతల పాత్రలను జగన్ వివరించబోతున్నట్లు సమాచారం.

2014-19లో అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు చేసిన అవినీతిని జనాలకు వివరించాలని నేతలకు జగన్ చెప్పబోతున్నారు. స్కాముల్లో సాంకేతిక అంశాలేమిటి..? రాజకీయ కారణాలు ఏమిటనే విషయాన్ని వివరిస్తారని పార్టీ వర్గాల సమాచారం. ఇక జనసేనతో పొత్తు విషయాన్ని కూడా జగన్ ప్రస్తావించబోతున్నారట.

టీడీపీ-జనసేన పొత్తు రాష్ట్రానికి ఏ విధంగా నష్టమో క్లారిటీ ఇవ్వబోతున్నారట. ప్రతిపక్షాలకు ఉండే ప్రతికూలతలు, వైసీపీకి ఉండే అనుకూలతలు, ప్రజాభిమానం, జనాభిప్రాయం, సంక్షేమ పథకాల అమలు తదితరాలను వివరించబోతున్నారు. నియోజకవర్గాల్లో ప్రచారం చేయాల్సిన అంశాలు ఏమిటి..? ప్రచార సమయంలో హైలైట్ చేయాల్సిన అంశాలు, జనాలకు వివరించి చెప్పాల్సిన పాయింట్లు, సోషల్ మీడియాను వాడుకోవాల్సిన విధానం, ప్రజలకు దగ్గరగా ఉండాల్సిన అవసరం తదితరాలపై జగన్ చెప్పబోతున్నారట. మొత్తానికి ఈరోజో రేపో ఎన్నికలు వచ్చేస్తున్నట్లుగానే జగన్ ఫీలవుతున్నారు. బహుశా ఎన్నికలకు ముందు పార్టీ నేతలతో నిర్వహిస్తున్న పెద్ద సభ బహుశా ఇదే చివరిదేమో.

First Published:  8 Oct 2023 5:39 AM GMT
Next Story