ప్రభుత్వం-పార్టీని గడపలెక్కిస్తున్న జగన్
ఈ కార్యక్రమం మొత్తం అధికారికంగా అంటే ప్రభుత్వం తరఫున జరుగుతున్న కార్యక్రమం. ఇదే కార్యక్రమాన్ని వేరే రూపంలో తొందరలోనే పార్టీ తరపున కూడా అమలు చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు.

మామూలుగా ప్రజాప్రతినిధులంటే జనాల్లో ఉన్న అభిప్రాయం వేరు. ఒకసారి గెలిచిన తర్వాత మళ్ళీ ఎన్నికలొచ్చినప్పుడు లేదా మధ్యలో అవసరమైతే మాత్రమే జనాల్లో తిరుగుతారనే అభిప్రాయముంది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచేంతవరకు జరిగింది కూడా ఇదే. అయితే దాదాపు ఏడాదికిందట జగన్ జనాల ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశారు. గడప గడపకు వైసీపీ ప్రభుత్వం అనే కాన్సెప్టును పుట్టించి, మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరినీ ప్రతి ఇంటి గడప తొక్కాల్సిందే అని స్పష్టంగా ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనటానికి వచ్చేఎన్నికల్లో టికెట్లివ్వటానికి జగన్ ముడిపెట్టడంతో 95 శాతం మంది దాదాపు ప్రతి ఇంటి గడప తొక్కుతున్నారు. మొదట్లో జనాల్లో కొందరినుండి వ్యతిరేకత కనిపించినా తర్వాత్తర్వాత అంతా సర్దుకున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం బాగా జరుగుతోంది. ప్రభుత్వం నుండి అర్హులైన జనాలకు అందుతున్న పథకాలను గుర్తుచేయటంతో పాటు ఏవైనా సమస్యలుంటే తెలుసుకుంటున్నారు. జనాలు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు.
ఈ కార్యక్రమం మొత్తం అధికారికంగా అంటే ప్రభుత్వం తరఫున జరుగుతున్న కార్యక్రమం. ఇదే కార్యక్రమాన్ని వేరే రూపంలో తొందరలోనే పార్టీ తరపున కూడా అమలు చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. దీనికే గృహసారథులు, గ్రామ, వార్డు సచివాలయ కన్వీనర్లని పేరుపెట్టారు. ఇప్పుడు సచివాలయాల తరపున వలంటీర్లు ఏవైతే పనులు చేస్తున్నారో అవే పనులను తొందరలోనే గృహసారథుల ద్వారా చేయించబోతున్నారు. ఎందుకంటే వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచమని ఎన్నికల కమిషన్ ఆదేశించింది కాబట్టే.
డిసెంబర్ మూడోవారం నుంచి జరగబోయేదేమంటే పార్టీ తరపున కూడా రెగ్యులర్ గా ప్రతి 50 ఇళ్ళలోని జనాలను ఒక ఆడ, ఒక మగ గృహసారథులు పలకరించబోతున్నారు. అంటే ఒకవైపు గడప గడపకు వైసీపీ ప్రభుత్వం రూపంలో అధికార యంత్రాంగం మరోవైపు వైసీపీ తరపున గృహసారథులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నారు. జగన్ కాన్సెప్టు వరకు బాగానే ఉంది మరిది ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాలి.