Telugu Global
Andhra Pradesh

60 ఏళ్ల ఆప్కాబ్ చరిత్రలో ఫస్ట్ టైమ్ డివిడెండ్

ప్రతి గ్రామంలో ఆర్బీకేలను, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు అనుసంధానం చేస్తున్నామని, కంప్యూటరైజేషన్, డిజిటలైజేషన్, అక్కడ నుంచి డీసీసీబీ, అక్కడ నుంచి ఆప్కాబ్‌ కు అనుసంధానం చేస్తామని, ఇలాంటి భారీ నెట్‌వర్క్‌ ఏ బ్యాంకుకి లేదన్నారు సీఎం జగన్.

60 ఏళ్ల ఆప్కాబ్ చరిత్రలో ఫస్ట్ టైమ్ డివిడెండ్
X

60 ఏళ్ల ఆప్కాబ్ చరిత్రలో ఫస్ట్ టైమ్ డివిడెండ్ ప్రకటిస్తున్నామని చెప్పారు సీఎం జగన్. విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంక్‌(ఆప్కాబ్‌) వజ్రోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. బ్యాంకు నూతన లోగో, పోస్టల్ స్టాంపు ఆవిష్కరించారు. 13 డీసీసీబీలకు డివిడెండ్ల పంపిణీతో పాటు బ్యాంకు విజన్ డాక్యుమెంట్‌ ను సీఎం ఆవిష్కరించారు. ఆప్కాబ్‌ నిలబడిన పరిస్థితి చూస్తే గర్వంగా ఉందన్నారు జగన్. చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి ఆప్కాబ్‌ కృషి చేస్తోందని వివరించారు. విప్లవాత్మక మార్పులు ఆప్కాబ్‌ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని, ఆప్కాబ్‌ తోనే రైతులకు బ్యాంకింగ్‌ వ్యవస్థ చేరువైందని, సహకార వ్యవస్థను వైఎస్సార్‌​ బలోపేతం చేశారని గుర్తు చేశారు.


2019 నుంచి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో సహకార బ్యాంకుల వాణిజ్య కార్యకలాపాలు 24 శాతం పెరిగాయన్నారు సీఎం జగన్. ఆప్కాబ్‌ లావాదేవీలు గణనీయంగా విస్తరించాయని, 2019 మార్చి 31న వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి రూ.53,249 కోట్లుగా ఉన్న సహకార బ్యాంకుల పరపతి ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.1,05,089 కోట్లకు చేరిందన్నారు. నాలుగేళ్లలో ఏకంగా రెట్టింపు అయిందని చెప్పారు. 2019లో రూ.13,700 కోట్లుగా ఉన్న ఆప్కాబ్‌ పరపతి నాలుగేళ్లలో 2023 నాటికి ఏకంగా రూ.36,700 కోట్లకు పెరిగి మూడురెట్లు అధికమైందని చెప్పారు. భారత రైతు అప్పుల్లోనే పుడతాడు, అప్పుల్లోనే బతుకుతాడు, అప్పుల్లోనే చనిపోతాడు అని ఒక నానుడి ఉండేదని.. బ్యాంకింగ్ వ్యవస్థ రైతులకు దగ్గరగా అడుగులు వేయడంతో కీలక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు జగన్.

ప్రతి గ్రామంలో ఆర్బీకేలను, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు అనుసంధానం చేస్తున్నామని, కంప్యూటరైజేషన్, డిజిటలైజేషన్, అక్కడ నుంచి డీసీసీబీ, అక్కడ నుంచి ఆప్కాబ్‌ కు అనుసంధానం చేస్తామని, ఇలాంటి భారీ నెట్‌వర్క్‌ ఏ బ్యాంకుకి లేదన్నారు. ఆర్బీకేల్లోనే బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు ఉన్నారని, వీరందరితో రాబోయే రోజుల్లో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటాయన్నారు సీఎం జగన్.

First Published:  4 Aug 2023 1:11 PM GMT
Next Story