Telugu Global
Andhra Pradesh

మాకు ఐఏఎస్‌లను ఇవ్వండి.. కేంద్రానికి ఏపీ ప్రభుత్వం మొర

ఇప్పటికే అరకొర మంది అధికారులతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం.. మాకు ఐఏఎస్‌లను కేటాయించాలంటూ కేంద్రానికి మొరపెట్టుకుంటోంది.

మాకు ఐఏఎస్‌లను ఇవ్వండి.. కేంద్రానికి ఏపీ ప్రభుత్వం మొర
X

రాష్ట్రం విడిపోయిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు 239 కేంద్ర సర్వీస్ అధికారుల అవసరం ఉన్నట్లు తేల్చారు. కానీ అప్పుడు కేటాయించింది 197 మంది ఆఫీసర్లనే. ఇక ఇప్పుడు ఏపీలో కొత్త జిల్లాలు కూడా ఏర్పాటయ్యాయి. గతంలో 13 జిల్లాలు ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 26కు చేరింది. అంటే గతంలో కంటే రెట్టింపు జిల్లాలు అయ్యాయి. మరోవైపు వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న హౌసింగ్ ప్రాజెక్ట్, సంక్షేమ పథకాలు, నాడు-నేడు వంటివి అమలు చేస్తోంది. గ్రామ/వార్డు సచివాలయాలను కూడా ఏర్పాటు చేసి పాలనను ప్రజల వద్దకే తీసుకొని వెళ్లింది. ఈ క్రమంలో మరింత మంది కేంద్ర సర్వీసు అధికారుల అవసరం పడింది. ఇప్పటికే అరకొర మంది అధికారులతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం.. మాకు ఐఏఎస్‌లను కేటాయించాలంటూ కేంద్రానికి మొరపెట్టుకుంటోంది.

విభజన సమయంలో కేంద్ర సర్వీసుల అధికారులకు ఆప్షన్ ఇచ్చారు. దీంతో చాలా మంది హైదరాబాద్‌ లేదా కేంద్రానికి వెళ్లిపోవడానికే మొగ్గు చూపారు. దీంతో ఏపీకి తగినంత మంది అధికారులు రాలేదు. ఇక వైఎస్ జగన్ సీఎం అయ్యాక ప్రతీ జిల్లాకు రెగ్యులర్ జాయింట్ కలెక్టర్‌తో పాటు అదనంగా ఇద్దరు జాయింట్ కలెక్టర్లను నియమించారు. ఒక జాయింట్ కలెక్టర్ వార్డు/గ్రామ సచివాలయాల పర్యవేక్షణ, పాలన, ఆరోగ్య సంబంధిత శాఖలు చూస్తున్నారు. మరో జాయింట్ కలెక్టర్ జగనన్న హౌసింగ్ స్కీమ్‌ను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్లను రెండు దశల్లో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో ఈ పథకం కోసం ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని ఇంచార్జిగా నియమించారు.

ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, హాస్టల్ మేనేజ్‌మెంట్‌ను మూడో జాయింట్ కలెక్టర్‌కు అప్పగించారు. స్పెషల్ గ్రేడ్ డిప్యుటీ కలెక్టర్ ర్యాంకు అధికారిని మూడో జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించి పనులు చేయిస్తున్నారు. అయితే కొత్త జిల్లాలు ఏర్పడటంతో చాలా మంది యువ జాయింట్ కలెక్టర్లు కొన్ని జిల్లాలకు కలెక్టర్లు అయ్యారు. కేంద్ర సర్వీసు అధికారుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఐఏఎస్ అధికారులను జాయింట్ కలెక్టర్ బాధ్యతల నుంచి తప్పించి.. వారిని కలెక్టర్లుగా నియమించారు.

ఇప్పుడు ఐఏఎస్‌ల కొరత ఉండటంతో కనీసం ఐటీడీఏ ప్రాజెక్టులకు పీవోలు కూడా దొరకడం లేదు. గతంలో కలెక్టర్లుగా నియమించబడక ముందు ఐటీడీఏ పీవోలుగా బాధ్యతలు నిర్వర్తించేవాళ్లు. యువ ఐఏఎస్‌లకు ప్రొబేషన్ పిరియడ్‌లో అదొక ట్రైనింగ్ లాగా ఉండేది. కానీ ఇప్పుడు ఐఏఎస్‌ల కొరత ఉండటంతో ప్రభుత్వం నేరుగా కలెక్టర్లను చేసేస్తోంది. దీనివల్ల పాలనలో అక్కడక్కడ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఒక అధికారి చెప్పారు. 2016 నుంచి 2020 మధ్యలో ఏపీకి కేవలం 50 మంది ఐఏఎస్ అధికారులనే కేటాయించారని.. ఇంకా మరింత మంది కేంద్ర సర్వీసు అధికారుల అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. ఈ మేరకు తమకు మరింత మంది అధికారులను కేటాయించాలంటూ లేఖ రాసింది.

మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొంది అమలులోకి వస్తే మరింత మంది ఐఏఎస్ అధికారుల అవసరం ఉంటుందని.. ఇప్పటికే కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి వీలైనంత త్వరగా అధికారులను కేటాయించాలని వైఎస్ జగన్ కేంద్రానికి లేఖ రాశారు.

First Published:  28 July 2022 4:06 AM GMT
Next Story