Telugu Global
Andhra Pradesh

కాపులకు జై కొట్టిన జగన్‌ !

అసెంబ్లీ ఎన్నికల రంగంలోకి పెద్ద మొత్తంలో, అంటే 30 మంది కాపుల్ని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించారు. ఉత్తరాంధ్ర, కీలకమైన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మెరికల్లాంటి కాపులను బరిలోకి దించారు.

X

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కాపు శక్తి కీలకమైనది. కాపులు ఎటువైపు..? అనేది ఈసారి మిలియన్‌ డాలర్‌ ప్రశ్న. కేవలం కాపు ఓట్ల కోసం పవన్‌ కళ్యాణ్‌ని చేరదీశాడు చంద్రబాబు. కాపు సీఎంగా పవన్‌ ఉండాలని బీజేపీ భావిస్తోంది. ముద్రగడ, హరిరామ జోగయ్య, వంగవీటి నరేంద్ర, వంగవీటి రాధాకృష్ణల మాటలకు ప్రాధాన్యత పెరిగింది. కాపు నాయకులు పవన్‌కి అనుకూలంగా, వ్యతిరేకంగా చీలి ఉన్నారు. జగన్మోహన్‌రెడ్డి ఉక్కిరి బిక్కిరి చేసే కొత్త వ్యూహంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఏకంగా ఐదుగురు కాపులకు ఎంపీ సీట్లు ఇచ్చారు. 1. బెల్లాన‌ చంద్రశేఖర్, 2. బొత్స ఝాన్సీ, 3. చలమలశెట్టి సునీల్, 4. సింహాద్రి చంద్రశేఖర్, 5. కిలారి రోశయ్య. పార్లమెంట్ ఎన్నికల యుద్ధంలోకి ఇంత మంది శక్తిమంతులైన కాపుల్ని దించడం ఒక వ్యూహాత్మక విజయం.

జగన్‌ ఇంతటితోనే ఆగిపోలేదు. అసెంబ్లీ ఎన్నికల రంగంలోకి పెద్ద మొత్తంలో, అంటే 30 మంది కాపుల్ని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించారు. ఉత్తరాంధ్ర, కీలకమైన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మెరికల్లాంటి కాపులను బరిలోకి దించారు. రెడ్డి శాంతి, బొత్స అప్పలనరసయ్య, బొత్స సత్యనారాయణ, బొడ్డుకొండ అప్పలనాయుడు, గొర్లె కిరణ్‌కుమార్, గుడివాడ అమర్‌నాథ్, అవంతి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ, మాలసాల భరత్‌కుమార్‌ అనే గెలుపు గుర్రాలను కదనరంగంలోకి ఉరికించారు. వీళ్లలో రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిన్నవాళ్లు, డబ్బు ధారాళంగా ఖర్చుపెట్టగల వాళ్లూ, జనాన్ని ఆకట్టుకోగలిగే వాళ్లూ ఉండేలా జగన్‌ జాగ్రత్తపడ్డారు.

ఇంకా, వరపుల సుబ్బారావు, తోట నరసింహం, దాడిశెట్టి రాజా, వంగా గీత, కురసాల కన్నబాబు, దవులూరి దొరబాబు, తోట త్రిమూర్తులు, జక్కంపూడి రాజా, గ్రంధి శ్రీనివాస్, గడ్డం శ్రీనివాస్‌ నాయుడు, కొట్టు సత్యనారాయణ, దూలం నాగేశ్వరరావులను రంగంలో నిలబెట్టారు. సీనియర్లు, అనుభవజ్ఞులు, ప్రత్యర్థులను ఢీకొట్టగలిగే సమర్థులనే జగన్‌ ఎంచుకున్నారు.

మరోపక్క ఆళ్ల నాని, వాసుబాబు, సింహాద్రి రమేష్‌బాబు, పేర్ని కిట్టు, సామినేని ఉదయభాను, కావటి మనోహర్‌ నాయుడు, యడం బాలాజీలను వైసీపీ క్యాండిడెట్లుగా ప్రకటించింది. ఇంతమంది ఒకే కులానికి చెందిన వాళ్లని పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టడం కాపుల్లో ఆసక్తి పెంచింది. జగన్‌ తమ మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం అని కాపు శ్రేణులు ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. అటు పవన్‌ కళ్యాణ్‌ గానీ, బీజేపీ గానీ, వందకి పైగా సీట్లలో పోటీ చేస్తున్న తెలుగుదేశం గానీ కాపులకు ఇన్ని సీట్లు ఇవ్వలేవు. పైగా ముద్రగడ, వంగవీటి నరేంద్రలాంటి అనేక మంది వైసీపీలో చేరి, జై జగన్‌ అంటున్నారు.

దీని వల్ల కాపుల్లో స్పష్టమైన చీలిక వచ్చింది. ఇక్కడ జగన్‌ వ్యూహం ఫలిస్తోంది. రాష్ట్రమంతా వ్యాపించి ఉన్న కాపులు, పవన్, చంద్రబాబు, జగన్‌ వర్గాలుగా విడిపోతే, అది క్లియర్‌గా వైసీపీకి అనుకూల పరిణామం. అదే సమయంలో పవన్ని అడ్డుపెట్టుకుని, కాపు ఓటు అనే దొడ్డిదారి ద్వారా అధికారంలోకి రావాలన్న చంద్రబాబు ఎత్తుగడ, పోలింగుకి ముందే చిత్తైనట్టు కనిపిస్తోంది. జగన్‌లాగా, ఏ ఎన్నికల్లోనూ, ఆంధ్రప్రదేశ్‌లో ఇంత మంది కాపుల్ని రంగంలోకి దించిన రాజకీయ సందర్భం మరొకటి లేనేలేదు. జగన్‌ ఇంత స్థిరంగా కాపుల పక్షాన ఉంటే, పవన్‌ అనే తోపు ఎవరివైపు నిలబడినట్టో..!

First Published:  24 March 2024 10:01 AM GMT
Next Story