Telugu Global
Andhra Pradesh

జగన్ నే మాయ చేయాలని చూశారు.. చివరకు

పీకే టీమ్ ఇలాంటి వ్యవహారాలపై నిఘా పెట్టి జగన్ కి సమాచారం ఇస్తోంది. దీంతో జగన్ కే మస్కా కొట్టాలనుకున్నవారు బుక్కైపోయారు.

జగన్ నే మాయ చేయాలని చూశారు.. చివరకు
X

గడప గడప విషయంలో జగన్, ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు, 27మందికి వార్నింగ్ ఇచ్చారనే విషయం తెలిసిందే. అయితే ఆ 27మంది ఏం చేశారు, ఎందుకు జగన్ వారిపై సీరియస్ అయ్యారు. లిస్ట్ లో లీకైన పేర్లను బట్టి చూస్తే చాలామంది మీడియాలో హడావిడిగా కనిపిస్తారు. సోషల్ మీడియాలో తిరుగులేదన్నట్టుగా వారి బిల్డప్ ఉంటుంది. నిత్యం ప్రజల్లో ఉండే నాయకులు, ప్రజలతో కలసి పనిచేసే నాయకులు, అసలు ఆయా నియోజకవర్గాల్లో ప్రతిపక్షమే లేని నాయకులన్నట్టు కలరింగ్ ఇస్తుంటారు. కానీ అలాంటి వారికి కూడా జగన్ క్లాస్ తీసుకున్నారు. కారణం ఏంటి..?

గడప గడప కాదు, వీధి వీధి..

గడప గడపకు మన ప్రభుత్వం అనే కాన్సెప్ట్ విషయంలో కొంతమంది సిన్సియర్ గా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన లబ్ధి వివరాలను వివరించి, సంతోషంగా ఉన్నారా అని అడిగి మరీ వెళ్తున్నారు. కానీ కొంతమంది తెలివిగా దాన్ని తమకి అనుకూలంగా మార్చేసుకున్నారు. గడప గడపకు వాళ్లు వెళ్లరు, ఊరందర్నీ ఒకేచోటకు రమ్మంటారు, లేదా ఆ ఊరిలో నాలుగు వీధుల్లోకి వెళ్తారు. ఆ కూడలి వద్దకే అందర్నీ పిలుస్తారు. సచివాలయ ఉద్యోగుల్ని కూడా అక్కడే పిలిచి అదో గ్రామ సభలాగా నిర్వహించి రోజుకి రెండు గంటలు హడావిడి చేస్తారు. వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో ఈ హడావిడి బాగానే హైలెట్ అవుతున్నా.. క్షేత్రస్థాయిలో గడప గడప అనే కాన్సెప్ట్ మాత్రం నెరవేరడంలేదు. పీకే టీమ్ ఇలాంటి వ్యవహారాలపై నిఘా పెట్టి జగన్ కి సమాచారం ఇస్తోంది. దీంతో జగన్ కే మస్కా కొట్టాలనుకున్నవారు బుక్కైపోయారు. మరికొంతమంది తమ బంధుగణాన్ని రంగంలోకి దింపుతున్నారు. ఎమ్మెల్యే తరపున ఆయన తమ్ముడో, చెల్లెలో, కూతురో, అల్లుడో.. ఇలా ఎవరో ఒకరు జనంలో ఉంటారు. ఎమ్మెల్యే బ్యానర్లు పెట్టుకుని వారు ముందుకు నడుస్తారు. ఫలానా మండలాలు కవర్ చేశాం అని వారు అధిష్టానానికి లెక్కలు చెప్పుకుంటారు. కానీ క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యే ఇల్లు కదలరు. ఇలాంటి వారికి కూడా క్లాస్ తీసుకున్నారు జగన్. ముఖ్యంగా కోస్తా జిల్లాలకు చెందిన ఓ ఎమ్మెల్యే ఇలా మస్కా కొట్టాలని చూసి అడ్డంగా బుక్కయ్యారని తెలుస్తోంది.

అటు మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతిపక్షాలను చెడుగుడు ఆడుకుంటున్నట్టు కనిపిస్తున్నా వారు మాత్రం జనంలోకి వెళ్లడంలేదు. ఇలాంటి వ్యవహారాలను కూడా ఉపేక్షించబోనని చెప్పారు సీఎం జగన్. ప్రతిపక్షాలను తిట్టాలి, కానీ జనంతోనే ఉండాలి.. ఇదీ ఆయన కాన్సెప్ట్. 175 నియోజకవర్గాలను టార్గెట్ చేస్తున్నామని చెప్పిన జగన్, సీట్ల కేటాయింపులో మొహమాటాలకు పోయేది లేదని ముందుగానే హింట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు హిట్ లిస్ట్ లో ఉన్న 27మందికి మళ్లీ సీట్లు వస్తాయా.. లేక ఆ లిస్ట్ తగ్గుతుందా, పెరుగుతుందా అనేది కూడా ముందు ముందు తేలాల్సి ఉంది. ప్రతిపక్షంలో ఉండి కూడా గెలిచాం, ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా అని రిలాక్స్ అయ్యే నాయకులందరికీ జగన్ కాస్త గట్టి వార్నింగే ఇచ్చారు. ఈ వార్నింగ్ తో అయినా ఎమ్మెల్యేలు ప్రతి గడపా తొక్కుతారేమో చూడాలి.

First Published:  28 Sep 2022 9:30 AM GMT
Next Story