Telugu Global
Andhra Pradesh

ఢిల్లీలో జగన్.. తొలిరోజు ఏం చేశారంటే..?

2017-18 అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్లుగా సాంకేతిక సలహా కమిటీ నిర్ణయించిందని, దీనికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు సీఎం జగన్.

ఢిల్లీలో జగన్.. తొలిరోజు ఏం చేశారంటే..?
X

ఢిల్లీ పర్యటనలో తొలిరోజు ఇద్దరు కేంద్ర మంత్రుల్ని కలిశారు సీఎం జగన్. ముందుగా ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ నిధుల విషయంలో ప్రధానంగా వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు జగన్.

2017-18 అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్లుగా సాంకేతిక సలహా కమిటీ నిర్ణయించిందని, దీనికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు సీఎం జగన్. అడ్ హక్ నిధుల విజ్ఞప్తిని ఆమోదించినందుకు సంతోషం అంటూనే.. నిధులను మరింత పెంచాలని కోరారు. పోలవరం తొలి దశ పూర్తి చేయడానికి ఇంకా రూ.17,144.06 కోట్లు అవసరమవుతాయని, ఆ మేరకు నిధులు విడుదలచేయాలని విన్నవించారు.

విద్యుత్ మంత్రితో భేటీ..

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కేసింగ్ తో సీఎం జగన్ భేటీ అయ్యారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏపీలో విద్యుత్ రంగం అభివృద్ధిపై కేంద్రమంత్రి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారని తెలుస్తోంది. ఆర్డీఎస్ఎస్ రీ వ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ కి ఏపీ అర్హత సాధించిందని, ఆ పథకం కింద నిధులు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీఎం జగన్ వెంట ఎంపీలు కూడా ఉన్నారు.

ఈరోజు కార్యక్రమాలు..

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం ఈరోజు జరుగుతుంది. ఈ సమావేశానికి బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్, ఛత్తీస్‌ ఘడ్, పశ్చి­మ బెంగాల్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా అధికారులు హాజరవుతారు. ఈ సమావేశంలో ఏపీ నుంచి సీఎం జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత హోం మంత్రి అమిత్ షా తో సీఎం భేటీ ఉంటుంది. ఈ మీటింగ్ తర్వాత జగన్ తిరిగి ఏపీకి బయలుదేరుతారు.

First Published:  6 Oct 2023 1:57 AM GMT
Next Story