Telugu Global
Andhra Pradesh

జగన్ స్పష్టంగా చెప్పేసినట్లేనా..?

2024 ఎన్నికలే చంద్రబాబుకు కచ్చితంగా చివరి ఎన్నికలని జగన్ తేల్చేశారు. బీసీలను తాను బ్యాక్ బోన్ క్లాస్ గా చూస్తుంటే చంద్రబాబుకు బ్యాక్ బోన్ గా ఎల్లోమీడియా, పవన్ ఉన్నారంటూ రెచ్చిపోయారు.

జగన్ స్పష్టంగా చెప్పేసినట్లేనా..?
X

వచ్చేఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తమకు వ్యతిరేకులుగా చూడాలని జగన్మోహన్ రెడ్డి బీసీలకు పిలుపిచ్చేసినట్లే. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు బీసీలను ఏ విధంగా తొక్కేసింది, బీసీ సంఘాల నేతలను ఏవిధంగా అవమానించారనే విషయాలను జగన్ గుర్తుచేశారు. విజయవాడలో జరిగిన జయహో బీసీ సదస్సులో జగన్ చేసిన ప్రకటన సంచలనమనే చెప్పాలి. కమ్మ, పవన్ తమకు వ్యతిరేకులన్న విషయాన్ని బీసీలు గుర్తించాలని జగన్ డైరెక్టుగానే బీసీ సామాజికవర్గానికి చెప్పేశారు.

2024 ఎన్నికలే చంద్రబాబుకు కచ్చితంగా చివరి ఎన్నికలని జగన్ తేల్చేశారు. బీసీలను తాను బ్యాక్ బోన్ క్లాస్ గా చూస్తుంటే చంద్రబాబుకు బ్యాక్ బోన్ గా ఎల్లోమీడియా, పవన్ ఉన్నారంటూ రెచ్చిపోయారు. ఎల్లోమీడియా అధిపతులు, పవన్ ఏ సామాజికవర్గానికి చెందినవారో బీసీలంతా గుర్తించాలని జగన్ అన్నారు. వీరంతా చంద్రబాబుకు ఎందుకు అండగా నిలుస్తున్నారో బీసీలు ఆలోచించాలన్నారు. నిజానికి ఒక సామాజికవర్గం ఇతర సామాజికవర్గాలను ప్రత్యర్ధులుగా చూడాలని గతంలో ఎవరు పిలుపివ్వలేదు.

మరిప్పుడు జగన్ ఇచ్చిన పిలుపు వైసీపీకి అనుకూలంగా వర్కవుటవుతుందో లేకపోతే బూమరాంగ్ అవుతుందో వేచి చూడాల్సిందే. ఏదేమైనా జయహో బీసీ సదస్సు మాత్రం గ్రాండ్ సక్సెస్ అనేచెప్పాలి. గతంలో చాలామంది సామాజికవర్గాల వారీగా బహిరంగసభలు, సదస్సులు నిర్వహించారు. అయితే కేవలం ఒక్క సామాజికవర్గంలోని ప్రజాప్రతినిధుల కోసమే సదస్సు జరగటం మాత్రం ఇదే ప్రథమం. వైసీపీ తరపున పంచాయతీ నుండి పార్లమెంటు వరకు ప్రాతినిధ్యం వహిస్తున్న 87 వేలమందిని పిలిచారు.

బీసీలకు వైసీపీ చేస్తున్న మేలును, చంద్రబాబు వల్ల జరిగిన అవమానాలు, నష్టాన్ని జగన్ వివరించారు. సదస్సులో పాల్గొన్నవారిలో మంచి జోష్ కనబడింది. బీసీలకు సంబంధించి తాను ఇస్తున్న ప్రాధాన్యతను చూసి మళ్ళీ వైసీపీకే మద్దతు ఇవ్వాలన్న విషయాన్ని జగన్ స్పష్టంగానే చెప్పేశారు. బీసీ సామాజికవర్గాలకు ఈ మెసేజ్ స్పష్టంగా చేరింది. జగన్-చంద్రబాబు వైఖరిని పోల్చి చూసుకున్నప్పుడు ఇద్దరిలో ఎవరేంటో బీసీలకు అర్థ‌మైపోతోంది. జగన్ కూడా ఇదే చేయమని అడిగారు. మరి దీని ఫలితం ఎలాగుంటుందో చూడాలి.

First Published:  8 Dec 2022 6:04 AM GMT
Next Story