Telugu Global
Andhra Pradesh

విశాఖ నుంచే పాలన.. జగన్ కీలక వ్యాఖ్యలు

మూడు రాజధానులంటూ సాగదీయకుండా.. విశాఖ పాలనా రాజధాని అని, త్వరలో విశాఖ నుంచే పాలన మొదలవుతుందన్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు జగన్.

విశాఖ నుంచే పాలన.. జగన్ కీలక వ్యాఖ్యలు
X

విశాఖను ఏపీకి ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా మరోసారి ప్రకటించారు సీఎం జగన్. విశాఖలో జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ని ప్రారంభించిన ఆయన రాజధానిపై కీలక ప్రకటన చేశారు. ఏపీకి మూడు రాజధానులంటూ సాగదీయకుండా.. విశాఖ పాలనా రాజధాని అని, త్వరలో విశాఖ నుంచే పాలన మొదలవుతుందన్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు జగన్.

ఏపీకి రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని గర్వంగా చెబుతున్నానన్నారు సీఎం జగన్. 340 సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు వచ్చాయని, గ్లోబల్ సమ్మిట్ తొలిరోజు 92 ఎంవోయూలు కుదిరాయని, మొత్తం 340 ఎంవోయూలు జరుగుతాయన్నారు. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు జగన్. దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారిందని, 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని చెప్పారు. ఏపీలో కీలక రంగాల్లో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చామన్నారు సీఎం.

రాష్ట్ర ఎగుమతులు గణనీయంగా పెరిగాయని చెప్పారు సీఎం జగన్. ఏపీ భౌగోళికంగా ఏపీ పరిశ్రమలకు అనుకూలం అన్నారు. పెట్టుబడులకే కాదు ప్రకృతి అందాలకు కూడా విశాఖ నెలవు అని, 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీ సొంతం అని స్పష్టం చేశారు. ఏపీలో సులువైన పారిశ్రామిక విధానం అమలులో ఉందని, పోర్టులకు సమీపంలో పుషల్కంగా భూములు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్స్‌ ఉంటే అందులో 3 ఏపీలోనే ఉన్నాయని అది రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో వరుసగా మూడేళ్లు ఏపీ నెంబర్‌-1 గా ఉందని చెప్పారు జగన్. గ్లోబల్ సమ్మిట్ పై ఆయన వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. రాజధాని విషయంలో మరోసారి సీఎం జగన్ చేసి వ్యాఖ్యలే హైలెట్ అవుతున్నాయి.

First Published:  3 March 2023 9:18 AM GMT
Next Story