Telugu Global
Andhra Pradesh

జగన్ ధైర్యమేంటి? ప్రతిపక్షాల్లో అయోమయం

ఆరు మాసాల్లో ఇళ్ళ నిర్మాణాలన్నీ పూర్తయిపోవాలని జగన్ డెడ్‌లైన్ పెట్టుకున్నారు. పార్కులు, అంగన్‌వాడీ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, విశాలమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ‌, వీధిదీపాలు, కమ్యూనిటీ హాళ్ళు అన్నీ ఏర్పాటవబోతున్నాయి.

జగన్ ధైర్యమేంటి? ప్రతిపక్షాల్లో అయోమయం
X

జగన్మోహన్ రెడ్డి ధైర్యమేంటో ఎవరికీ అర్థంకావటంలేదు. ప్రతిపక్ష పార్టీలు సైతం జ‌గ‌న్ స్టాట‌జీని అర్థం చేసుకోలేక‌ జుట్టు పీక్కుంటున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే రాజధాని అమరావతి ప్రాంతంలోని కృష్ణాయపాలెం గ్రామంలో ఇళ్ళ నిర్మాణానికి జగన్ భూమిపూజ చేయబోతున్నారు. తర్వాత బహిరంగసభ జరుగుతుంది. మే 26న పేదలకు పంపిణీ చేసిన 50,793 పట్టాల్లో ఇపుడు పక్కా ఇళ్ళను ప్రభుత్వం నిర్మించబోతోంది. ఇళ్ళనిర్మాణాలకి ప్రభుత్వం రూ. 1829 కోట్ల ఖర్చు చేయబోతోంది.

ఆరు మాసాల్లో ఇళ్ళ నిర్మాణాలన్నీ పూర్తయిపోవాలని జగన్ డెడ్‌లైన్ పెట్టుకున్నారు. పార్కులు, అంగన్‌వాడీ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, విశాలమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ‌, వీధిదీపాలు, కమ్యూనిటీ హాళ్ళు అన్నీ ఏర్పాటవబోతున్నాయి. పార్కులు, రోడ్ల పక్కన చెట్లు నాటడం, డ్రైనేజీ ఏర్పాటు, వీధిదీపాల ఏర్పాట్లు ఇప్పటికే మొదలైపోయాయి. నిజానికి వీట‌న్నీ ఏర్పాటుకు జగన్‌కు ధైర్యం అవసరంలేదు. కానీ ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉంది. ఇళ్ళ పట్టాల పంపిణీకే ప్రభుత్వం పెద్ద పోరాటం చేయాల్సొచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

అమరావతి ప్రాంతంలోని కొందరు ఇళ్ళ పట్టాలను అడ్డుకున్నారు. పోరాటం చేసి కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకున్న ప్రభుత్వం తర్వాత ఇళ్ళ నిర్మాణాలకు రెడీ అయ్యింది. వెంటనే మళ్ళీ కొందరు కోర్టుకెక్కారు. ఇళ్ళ పట్టాల పంపిణీకి మాత్రమే అనుమతిచ్చింది కానీ ఇళ్ళ నిర్మాణాలకు కాదన్నది వాళ్ళ వాదన. వాళ్ళ అసలు భయం ఏమిటంటే ఇక్కడ 51 వేల మంది నివాసాలుంటే టీడీపీకి ఇబ్బందులు తప్పవని. ఎలాగంటే ఇప్పుడు నిర్మించబోయే ఇళ్లు అన్నీ మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలోనే ఉంటాయి. రాబోయే ఎన్నికల్లో మంగళగరిలో పోటీ చేయాలని అనుకుంటున్న లోకేష్‌కు మరోసారి ఓటమి తప్పదని టీడీపీ భయపడుతోంది.

ఇదే వివాదంపై కోర్టులో విచారణ ముగిసింది. తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని జడ్జి విచారణ సందర్భంగానే అడిగారు. ఇప్పుడు చేస్తున్న వందలాది కోట్ల రూపాయలు వృధా అవుతాయికదాని ప్రశ్నించారు. విచారణ ముగిసి తీర్పును జడ్జి రిజర్వు చేశారు. ఎప్పుడు తీర్పొస్తుందో తెలియ‌దు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం ఇళ్ళ నిర్మాణాలను మొదలుపెట్టేస్తోంది. ఇక్కడే జగన్ ధైర్యమేమిటో అర్థంకావటంలేదు. జడ్జి అడిగినట్లే తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? నిర్మిస్తున్న ఇళ్ళన్నీ పేదల కోసమే కాబట్టి తీర్పు వ్యతిరేకంగా రాదన్నదే జగన్ ధైర్యమా?

First Published:  24 July 2023 5:40 AM GMT
Next Story