Telugu Global
Andhra Pradesh

కుప్పంలో వైసీపీ గెలుపు ఖాయం.. జగన్ లాజిక్ ఇదే

పేదలకు వందల కోట్ల లబ్ధి జరిగినప్పుడు ప్రత్యర్ధి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం అని చెప్పారు జగన్. మంచి జరిగినప్పుడు ప్రజలు కచ్చితంగా ఆదరిస్తారని, ఎన్నికల వేళ ఆ మంచిని వారికి వివరించి చెప్పాల్సిన అవసరం నాయకులకు ఉందని అన్నారు.

కుప్పంలో వైసీపీ గెలుపు ఖాయం.. జగన్ లాజిక్ ఇదే
X

వైనాట్ 175 అంటూ సీఎం జగన్ ధీమాగా చెబుతుంటే.. వైసీపీ ప్రత్యర్థులే కాదు, సొంత పార్టీ నేతలు కూడా కొంతమంది అతిశయోక్తిగా చూశారు. కానీ జగన్ ఫార్ములా ప్రకారం చూస్తే కుప్పంతోపాటు అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు ఖాయం అనుకోవాల్సిందే. నిన్న జరిగిన 'బూత్ సిద్ధం' మీటింగ్ లో కుప్పం నియోజకవర్గానికి సంబంధించి పలు కీలక విషయాలను మళ్లీ తెరపైకి తెచ్చారు సీఎం జగన్. ఏపీలోని ప్రతి నియోజకవర్గంలో అలాంటి పరిస్థితే ఉందని స్పష్టం చేశారు. అలాంటి అనుకూల పరిస్థితుల్లో వైసీపీ గెలుపు ఖాయం అని తీర్మానించారు.

కుప్పం నియోజకవర్గానికి కేటాయించిన మొత్తం నిధులు రూ.రూ.1,400 కోట్లు

కుప్పంలో ఉన్న మొత్తం ఇళ్లు 87 వేలు పైగా

నవరత్నాల ద్వారా మేలు జరిగిన ఇళ్లు 83 వేలు

కుప్పంలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన ఇళ్ల శాతం 93.29

పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం మారకూడదని అనుకుంటున్నారని, అంటే కుప్పం సహా అన్ని చోట్లా వైసీపీ గెలుపు ఖాయమేనని చెబుతున్నారు సీఎం జగన్.

రాష్ట్రవ్యాప్తంగా ఏ నియోజకవర్గం తీసుకున్నా 87 శాతం పైచిలుకు ఇళ్లకు మంచి చేయగలిగామన్నారు సీఎం జగన్. రాష్ట్రవ్యాప్తంగా బటన్‌ నొక్కి రూ.2.55 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేస్తే అందులో రూ.1,400 కోట్లు కుప్పం నియోజకవర్గంలో 83 వేల ఇళ్లకు ఇవ్వగలిగామన్నారు. ఆ నియోజకవర్గంలో టీడీపీ హయాంలో 30 వేల ఇళ్లకు మాత్రమే పెన్షన్‌ ఇచ్చేవారని, వైసీపీ హయాంలో 45 వేల కుటుంబాలకు ఇస్తున్నామని చెప్పారు. 30వేలకు పైగా కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని, చేయూత, ఆసరా, విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మఒడి కూడా అందించామన్నారు. వందల కోట్లు ఇచ్చినప్పుడు ప్రత్యర్ధి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం అని చెప్పారు జగన్. మంచి జరిగినప్పుడు ప్రజలు కచ్చితంగా ఆదరిస్తారని, ఎన్నికల వేళ ఆ మంచిని వారికి వివరించి చెప్పాల్సిన అవసరం నాయకులకు ఉందని అన్నారు.

First Published:  28 Feb 2024 2:24 AM GMT
Next Story