Telugu Global
Andhra Pradesh

పెద్దిరెడ్డి ముందు హిందూపురం పంచాయితీ..

ఇక్బాల్‌ కాకుండా ఎవర్ని ఇన్‌ ఛార్జ్‌ గా పెట్టినా పార్టీకోసం తాము పనిచేస్తామన్నారు. ఆయనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే తాము పార్టీ గెలుపుకోసం పనిచేయబోమని తేల్చి చెప్పారు.

పెద్దిరెడ్డి ముందు హిందూపురం పంచాయితీ..
X

ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 175 గెలవాలనే పట్టుదలతో ఉన్నారు సీఎం జగన్. ఇప్పటికే కుప్పంలో పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నారు. కానీ హిందూపురం లాంటి కొన్నిచోట్ల మాత్రం సర్దుబాట్లు అస్సలు కుదరడంలేదు. వైసీపీ పెట్టిన తర్వాత ఇంకా అక్కడ బోణీ కొట్టలేదు. ఇంకా చెప్పాలంటే టీడీపీ స్థాపించినప్పటినుంచీ అక్కడ గెలవడం కాంగ్రెస్ కి కూడా సాధ్యం కాలేదు. 1983 నుంచి అది టీడీపీ కంచుకోట. ఎన్టీఆర్, హరికృష్ణ తర్వాత ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో వైసీపీ తరపున నవీన్ నిశ్చల్ పోటీ చేసి ఓడిపోయారు. 2019లో బాలయ్య చేతిలో వైసీపీ అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్ 17వేల మార్జిన్ తో ఓటమి చవిచూశారు. సీఎం జగన్ సీరియస్ గా ఫోకస్ పెట్టిన నియోజకవర్గాల్లో హిందూపురం కూడా ఒకటని అంటారు.

టీడీపీ కంచుకోటని బద్దలు కొట్టి వైసీపీ దెబ్బ ఏంటో చూపించాలని అనుకుంటున్నారాయన. కానీ స్థానిక నేతల్లో ఒకరంటే ఒకరికి పొసగడంలేదు. ఆమధ్య జిల్లా పర్యటనకు వచ్చిన జగన్.. ఇరు వర్గాలతో మాట్లాడారు. ఫలితం లేకపోయే సరికి మంత్రి పెద్దిరెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు.

సహజంగా ఏ నియోజకవర్గంలో అయినా రెండు గ్రూపులుంటాయి. కానీ హిందూపురంలో మూడు గ్రూపులున్నాయి. 2014లో వైసీపీ అభ్యర్థి నిశ్చల్, 2019లో వైసీపీ అభ్యర్థి ఇక్బాల్ రెండు గ్రూపులుగా ఉన్నారు. 2009లో టీడీపీ తరపున గెలిచిన అబ్దుల్ ఘనీ కూడా ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఈ ముగ్గురిలో 2024 వైసీపీ అభ్యర్థి ఎవరనేదే ఇప్పుడు సస్పెన్స్. ఇక్బాల్ కి ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఆయన సైడైపోతారని అనుకున్నారంతా. కానీ ఆయన ఇప్పుడు హిందూపురంలో ఆధిపత్యం కోసం ట్రై చేస్తున్నారు. 2024లో తానే అభ్యర్థినంటూ ప్రచారం చేసుకుంటున్నారు. నవీన్ నిశ్చల్, అబ్దుల్ ఘనీ వర్గాలకు ఇది మింగుడు పడటంలేదు.

తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం నేతలతో సమావేశమయ్యారు. పెద్దిరెడ్డి సమక్షంలోనే ఇరు వర్గాల నేతలు పరస్పరం వాగ్వాదానికి దిగటం విశేషం. ఎమ్మెల్సీ ఇక్బాల్‌ పై నవీన్‌ నిశ్చల్‌, అబ్దుల్‌ ఘనీ వర్గం నేతలు పెద్దిరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇక్బాల్‌ వల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని.. ఆయన స్థానికుడు కాదని, ఆయనకు టికెట్ ఇవ్వొద్దని పెద్దిరెడ్డిని కోరారు. ఇక్బాల్‌ కాకుండా ఎవర్ని ఇన్‌ ఛార్జ్‌ గా పెట్టినా పార్టీకోసం తాము పనిచేస్తామన్నారు. ఆయనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే తాము పార్టీ గెలుపుకోసం పనిచేయబోమని తేల్చి చెప్పారు.

అంతా పార్టీ ఇష్టం..

ఇక ఇక్బాల్ కూడా అంతే పౌరుషంగా ఉన్నారు. పార్టీ ఆదేశిస్తే నియోజకవర్గాన్ని వదిలి వెళ్లేందుకైనా తాను సిద్ధమని తేల్చి చెప్పారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా, తనను పోటీ చేయొద్దని సీఎం జగన్‌ చెప్పినా.. హిందూపురాన్ని వదిలి వెళ్లిపోతానన్నారు. ఎవ్వరూ తగ్గేట్టు లేకపోవడంతో పెద్దిరెడ్డి ఈ పంచాయితీ సీఎం దగ్గర పెట్టేందుకు సిద్ధమయ్యారు.

First Published:  19 July 2022 1:30 AM GMT
Next Story