Telugu Global
Andhra Pradesh

రాజమండ్రిలో రచ్చ రచ్చ.. అమరావతి యాత్రలో గందరగోళం..

అమరావతి యాత్రకు టీడీపీ నేతలు నేరుగా మద్దతు ఇచ్చేందుకు తరలి వస్తున్నారు. దీంతో యాత్ర పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇటు వైసీపీ నేతలు కూడా నేరుగా తెరపైకి వస్తున్నారు.

రాజమండ్రిలో రచ్చ రచ్చ.. అమరావతి యాత్రలో గందరగోళం..
X

అమరావతి పాదయాత్ర ఈరోజు మరింత హాట్ హాట్ గా మారింది. రాజమండ్రిలో వైసీపీ నేతలు ఎదురుపడే సరికి ఎవ్వరూ కంట్రోల్ కాలేకపోయారు. అఖిలపక్ష నేతలు నల్లబెలూన్లు చూపిస్తూ, నల్లకండువాలతో వారిని అడ్డుకోవాలని చూశారు. పోలీసులు జోక్యం చేసుకున్నా కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. చివరకు రైతుల యాత్రపైకి కొంతమంది వాటర్ బాటిల్స్ విసరడంతో గొడవ మొదలైంది.

దాడిని ఖండిస్తున్నాం..

అమరావతి యాత్రపై వాటర్ బాటిళ్లతో దాడి జరిగిందని, ఈ దాడిని ఖండిస్తున్నామని చెప్పారు టీడీపీ నేతలు. వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, ఎంపీ భరత్ కావాలనే వారిని రెచ్చగొట్టి దాడి జరిగేలా చేశారని అన్నారు. దీంతో మరోసారి వైసీపీ నేతలు యాత్రపై భగ్గుమన్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోయారు..

అటు వైసీపీ నుంచి కూడా ఎదురుదాడి మొదలైంది. యాత్రలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు మూడు రాజధానులకు మద్దతు తెలిపేవారిని కించపరిచారని, వారిపై దాడి చేశారని అన్నారు. అఖిలపక్ష నేతలు శాంతియుతంగా ప్రదర్శన చేపట్టారని, కానీ రైతుల ముసుగులో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మరికొంతమంది వారిని రెచ్చగొట్టారని అన్నారు. వాటర్ బాటిల్స్ దాడికి వైసీపీ నేతలు కారణం కాదని చెప్పారు ఎంపీ మార్గాని భరత్.

విశాఖ గర్జన తర్వాత గరం గరం..

వైసీపీ నేతల ఆధ్వర్యంలో విశాఖ గర్జన జరిగిన తర్వాత అమరావతి యాత్ర మరింత హాట్ హాట్ గా మారింది. వైసీపీ, పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా.. అటు అమరావతి యాత్రకు టీడీపీ నేతలు నేరుగా మద్దతు ఇచ్చేందుకు తరలి వస్తున్నారు. దీంతో యాత్ర పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇటు వైసీపీ నేతలు కూడా నేరుగా తెరపైకి వస్తున్నారు. అఖిలపక్ష నేతలతో కలసి నల్లబెలూన్లు పట్టుకుని అమరావతి రైతుల్ని అడ్డుకునేందుకు వస్తున్నారు. పోటా పోటీ నినాదాలతో రాజమండ్రిలో యాత్ర రసాభాసగా మారింది. ముందు ముందు అమరావతి యాత్ర మరింత గందరగోళానికి దారితీసే పరిస్థితులు కనపడుతున్నాయి.

First Published:  18 Oct 2022 10:02 AM GMT
Next Story