Telugu Global
Andhra Pradesh

హిందూపురంలో గెలుపును టీడీపీకి రాసిచ్చేసినట్లేనా?

తాజా పరిణామాలను బట్టి చూస్తే హిందూపురంలో టీడీపీ గెలుపు మళ్ళీ ఖాయమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. హిందూపురం వైసీపీలో గ్రూపుల గోల చాలా ఎక్కువగా ఉంది. ముగ్గురు నేతలు నవీన్ నిశ్చల్, అబ్దుల్ ఘనీ, మహమ్మద్ ఇక్బాల్ మధ్య తీవ్రస్ధాయిలో గొడవలున్నాయి.

హిందూపురంలో గెలుపును టీడీపీకి రాసిచ్చేసినట్లేనా?
X

అసలే హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ పునాదులు చాలా బలంగా ఉన్నాయి. టీడీపీ ఏర్పాటైన దగ్గర నుండి ఈ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధులకు ఓటమన్నదే లేదు. నందమూరి కుటుంబం పోటీచేసినా ఇంకెవరు పోటీచేసినా ఓడిందిలేదు. 1983 నుండి టీడీపీకి ఓటమన్నదే లేని నియోజకవర్గం రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది హిందుపురం మాత్రమే. వచ్చేఎన్నికల్లో 175కి 175 సీట్లూ గెలవాలని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. కాబట్టి కచ్చితంగా ఇందులో హిందూపురం కూడా ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అయితే తాజా పరిణామాలను బట్టిచూస్తే హిందూపురంలో టీడీపీ గెలుపు మళ్ళీ ఖాయమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మామూలుగానే హిందూపురం వైసీపీలో గ్రూపుల గోల చాలా ఎక్కువగా ఉంది. ముగ్గురు నేతలు నవీన్ నిశ్చల్, అబ్దుల్ ఘనీ, మహమ్మద్ ఇక్బాల్ మధ్య తీవ్రస్ధాయిలో గొడవలున్నాయి. ఈ గ్రూపుల గోల కారణంగానే నందమూరి బాలకృష్ణ వరుసగా రెండుసార్లు గెలిచారు. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలాగైనా గెలిపించాలని జగన్ అనుకుంటుంటే లోకల్ లీడర్లు మాత్రం అందుకు బ్రేకులేస్తున్నారు.

ఈమధ్యనే లోకల్ లీడర్ రామకృష్ణారెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. రెడ్డికి ఇక్బాల్‌కు ఏమాత్రం పడటంలేదు. ఈ కారణంగానే రెడ్డి హత్య జరిగిందనే ఆరోపణలు బాగా పెరిగిపోతున్నాయి. తన సోదరుడిని ఇక్బాల్, ఆయన పీఏ గోపీకృష్ణే హత్య చేయించారని మృతుడి సోదరి మధుమతి చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి.

అలాంటిది తాజాగా రెడ్డి హత్యకు ఇక్బాల్ మద్దతుదారుడు మురళి, అరుణ్, పీఏ గోపీ మధ్య జరిగిన మొబైల్ సంభాషణ ఆజ్యంపోస్తోంది. ముగ్గురు కలిసే రెడ్డి హత్యకు ప్లాన్ చేశారని ఫోన్ సంభాషణలతో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇది కచ్చితంగా నియోజకవర్గంలో పార్టీకి నష్టం చేసేదే అనటంలో సందేహం లేదు. పార్టీ కోసం రామకృష్ణారెడ్డి బాగా కష్టపడే వ్యక్తిగా పాపులర్. అలాంటిది రెడ్డి హత్యలో పార్టీ ఎమ్మెల్సీతో పాటు పార్టీలోనే ఉన్న ఆయన మద్దతుదారులు కుట్ర చేశారంటే కచ్చితంగా మైనస్సనే చెప్పాలి. ఇందుకనే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలుపును వైసీపీ రాసిచ్చేసిందనే అనుకుంటున్నారు.

First Published:  22 Oct 2022 6:58 AM GMT
Next Story