Telugu Global
Andhra Pradesh

వైసీపీలో ఆధిపత్య పోరులు.. మరొకరి హత్య

5వ డివిజన్‌ ఎస్సీ రిజర్వుడ్‌ కావడంతో మొన్నటి కార్పొరేషన్‌ ఎన్నికల్లో సురేష్ స్నేహితుడు ప్రసాద్‌ పేరు పరిశీలనకు వచ్చింది. కానీ ఆఖరిలో సురేష్‌ వర్గానికి టికెట్ దక్కలేదు. అయినా పార్టీలో ఉంటూ బలపడేందుకు ప్రయత్నిస్తున్నాడు.

వైసీపీలో ఆధిపత్య పోరులు.. మరొకరి హత్య
X

వైసీపీలో గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు చాలా చోట్ల గ్రూపు రాజకీయాలున్నాయి. జగన్‌ పార్టీ పెట్టినప్పుడు తొలుత వచ్చిన వారు కొందరు.. కాంగ్రెస్‌ అధికారం కోల్పోయిన తర్వాత రాజకీయ మనుగడ కోసం వచ్చిన వారు మరికొందరు. ఇలా చాలా చోట్ల వైసీపీలోనే రెండు వర్గాలున్నాయి. అవి హత్యల వరకు వెళ్తున్నాయి. హిందూపురం వైసీపీ మాజీ ఇన్‌చార్జ్ రామకృష్ణారెడ్డి హత్య అలాంటిదేనని చెబుతున్నారు.

తొలి నుంచి ఉన్న వారిని పక్కన పెట్టి.. ఇక్బాల్‌ను ఆఖరిలో దిగుమతి చేసుకోవడంతో అక్కడ వ్యవహారం బెడిసికొట్టింది. తాజాగా విజయవాడ క్రీస్తురాజపురంలోనూ వైసీపీలో అధిపత్య పోరు ఒక నాయకుడి హత్యకు దారి తీసింది. 5వ డివిజన్ వైసీపీలోనూ చాలా కాలంగా సురేష్‌, చౌడేష్‌ అనే ఇద్దరు నాయకుల మధ్య అధిపత్యపోరు నడుస్తోంది.

5వ డివిజన్‌ ఎస్సీ రిజర్వుడ్‌ కావడంతో మొన్నటి కార్పొరేషన్‌ ఎన్నికల్లో సురేష్ స్నేహితుడు ప్రసాద్‌ పేరు పరిశీలనకు వచ్చింది. కానీ ఆఖరిలో సురేష్‌ వర్గానికి టికెట్ దక్కలేదు. అయినా పార్టీలో ఉంటూ బలపడేందుకు ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో చౌడేష్‌ కూడా నాయకులకు దగ్గరగా ఉంటూ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఇటీవల స్థానిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి విడదల రజనీతో చౌడేష్‌కు సన్మానం చేయించారు. తాను కష్టపడుతున్నా తనను కాదని చౌడేష్‌కు మంత్రి చేత సన్మానం చేయించడంతో సురేష్ అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పటి నుంచి సురేష్‌, చౌడేష్‌ మధ్య వివాదం తారా స్థాయికి చేరింది.

సురేష్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. అన్నట్టుగానే రాత్రి 7 గంటల సమయంలో చౌడేష్ మద్యం సేవించి తన కారుతో సురేష్‌ను ఢీకొట్టాడు. అనంతరం కారుతో తొక్కించాడు. దాంతో సురేష్‌ చనిపోయాడు. మృతుడి కుటుంబసభ్యులను వైసీపీ నేత దేవినేని అవినాష్ పరామర్శించారు. తన భర్త ఏ తప్పు చేయలేదని, తమకు చిన్న పిల్లలు ఉన్నారని.. ఇక తాము ఎలా బతకాలంటూ సురేష్‌ భార్య విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇప్పటికే చౌడేష్‌ అతని స్నేహితులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

First Published:  10 Oct 2022 1:52 AM GMT
Next Story