Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్యేకి తృటిలో తప్పిన ప్రమాదం

ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో ఒక వైపు ఎమ్మెల్యే మద్దతుదారులు, మిగిలిన మూడు వైపులా వైసీపీ నేతలు మోహరించారు. పోలీసులు లేకపోయుంటే ఎమ్మెల్యే మీద దాడి జరిగేది అనటంలో సందేహం లేదు. నిజంగానే ఎమ్మెల్యే మీద దాడి జరిగుంటే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారేదే.

ఎమ్మెల్యేకి తృటిలో తప్పిన ప్రమాదం
X

ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి మద్దతుదారులకు వైసీపీ నేతలకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరువర్గాలు కొట్టుకోవ‌డం ఒకటే తక్కువ అన్నంతగా గొడవ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో దాడి నుంచి ఎమ్మెల్యే తృటిలో తప్పించుకున్నారు. దాదాపు రెండు గంటలు రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతున్నపుడు సస్పెండ్ అయిన ఎమ్మెల్యే మేకపాటి అక్కడే ఉండటం, అసలు గొడవకు ఆయనే కారణం అవ్వటమే విచిత్రంగా ఉంది. తనను తరిమికొట్టేంత మగాడు పార్టీలో ఎవరున్నారో రమ్మంటు ఎమ్మెల్యే సవాలు విసిరి బస్టాండ్ సెంటర్లో కుర్చీ వేసుకుని కూర్చోవటంతో గొడవ మొదలైంది.

ఈమధ్యనే జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపున‌కు అనుకూలంగా వైసీపీలోని నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నలుగురిలో మేకపాటి కూడా ఉన్నారు. అప్పటి నుండి ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే పార్టీ నేతలు మండిపోతున్నారు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు లేనంత సెగ ఉదయగిరిలో మాత్రమే ఎందుకుంది అంటే మొదటి నుండి ఎమ్మెల్యే అంటే పార్టీ నేతల్లో బాగా వ్యతిరేకత ఉండటమే ఇందుకు కార‌ణం.

ఎమ్మెల్య‌కే కుటుంబ వివాదాలు, ఎమ్మెల్యే భార్యలమని చెప్పి కొందరు మహిళలు నియోజకవర్గంలో చేస్తున్న పంచాయితీలు తదితరాలతో మేకపాటిపై వ్యతిరేకత పెరిగిపోయింది. ఎమ్మెల్యే వల్ల పార్టీ నియోజకవర్గంలో బాగా గబ్బుపట్టిపోతోందనే ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ఇదే విషయాన్ని జగన్ పిలిచి ఎన్నిసార్లు మాట్లాడినా ఎమ్మెల్యే వైఖరిలో మార్పురాలేదు. దాంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేదిలేదని చెప్పేశారు. అప్పటి నుండి నియోజకవర్గంలో మరింత కంపు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్రాస్ ఓటింగ్ విషయం బయటపడింది.

దాంతో దొరికింది చాన్స్ అన్న‌ట్టుగా సస్పెండ్ చేసేశారు. నిజానికి గురువారం గొడవలో ఎమ్మెల్యే మీద కొందరు దాడికి ప్లాన్ చేశారట. అయితే సకాలంలో పోలీసులు ఎంటరై రెండు వర్గాలను కంట్రోల్ చేశారట. బస్టాండ్ సెంటర్లో ఒక వైపు ఎమ్మెల్యే మద్దతుదారులు, మిగిలిన మూడు వైపులా పార్టీ నేతలు మోహరించారు. పోలీసులు లేకపోయుంటే ఎమ్మెల్యే మీద దాడి జరిగేది అనటంలో సందేహంలేదు. నిజంగానే ఎమ్మెల్యే మీద దాడి జరిగుంటే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారేదే. ఈ విషయం తెలిసి కూడా ఎమ్మెల్యే మేక‌పాటి మొండిగా పార్టీ నేతలను ఎందుకు రెచ్చగొడుతున్నారో అర్థంకావటం లేదు.

First Published:  31 March 2023 5:48 AM GMT
Next Story