Telugu Global
Andhra Pradesh

చిరంజీవి కోరిక నెరవేరుతుందా ?

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్ట‌వ‌చ్చు, జనాలు ఆశీర్వదిస్తే ఎవరైనా ముఖ్యమంత్రి అయిపోవచ్చు. అయితే అందుకు సదరు నేతకు ఉన్న అవకాశాలు ఏమిటనేది లాజికల్‌గా ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు పవన్ సీఎం అయ్యే విషయంలో చిరంజీవి ఆశ నెరవేరేందుకు అవకాశాలు తక్కువనే చెప్పాలి.

చిరంజీవి కోరిక నెరవేరుతుందా ?
X

రాష్ట్రాన్ని ఏలే అవకాశం తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు ప్రజలు ఇస్తారని మెగాస్టార్ చిరంజీవి ఆశిస్తున్నారు. తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అన్నగా చిరంజీవి కోరుకోవటంలో తప్పేలేదు. ఎకనామిక్స్ లో ఒక సూత్రముంది. అదేమిటంటే 'కోరికలు అనంతాలు..అవి సమకూరు మార్గాలు పరిమితాలు' అని. ఇక్కడ పవన్ విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్ట‌వ‌చ్చు, జనాలు ఆశీర్వదిస్తే ఎవరైనా ముఖ్యమంత్రి అయిపోవచ్చు. అయితే అందుకు సదరు నేతకు ఉన్న అవకాశాలు ఏమిటనేది లాజికల్‌గా ఆలోచించాలి. సో లాజికల్‌గా ఆలోచించినప్పుడు పవన్ సీఎం అయ్యే విషయంలో చిరంజీవి ఆశ నెరవేరేందుకు అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఎలాగంటే ఏపీలో 175 అసెంబ్లీ సీట్లున్నాయి. జనసేన అధికారంలోకి రావాలంటే తక్కువలో తక్కువ 88 సీట్లలో గెలవాలి.

88 సీట్లలో గెలవాలి అనుకున్న పార్టీ 175 సీట్లలోనూ పోటీచేయాల్సిందే. అన్నీ సీట్లకు పోటీచేసినా నూరు శాతం ఏ పార్టీ కూడా గెలవలేదు. అందుకనే తక్కువలో తక్కువ 88 సీట్లు గెలవాలన్నది. మరి జనసేన వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లకు పోటీ చేస్తుంది. మిత్రపక్షం బీజేపీతోనే కలిసున్నా 100 సీట్లకు పోటీచేయగలదు. ఎందుకంటే మిగిలిన సీట్లను బీజేపీకి వదిలేయాలి. మరి 100 సీట్లలో పోటీచేస్తుందని అనుకున్నా జనసేన 88 సీట్లలో గెలవగలదా ?

ఒకవేళ బీజేపీతో కాకుండా టీడీపీతో పొత్తు పెట్టుకుందని అనుకుంటే పోటీచేసే సీట్లు బాగా తగ్గిపోతాయి. చంద్రబాబునాయుడు సీఎం సీటును ఎవరికీ వదిలే అవకాశం లేదు కాబట్టి జనసేనకు మహాయితే 40 సీట్లకు మించి కేటాయించే అవకాశమే లేదు. మరి పోటీ చేస్తుందని అనుకుంటున్న 40 సీట్లలో ఎన్ని గెలుస్తుంది ? సో బీజేపీతో కలిసి పోటీ చేసినా, టీడీపీతో పొత్తు పెట్టుకున్నా పవన్‌కు సీఎం అయ్యే అవకాశమైతే దాదాపు లేదనే అనిపిస్తోంది. పొత్తులేవీ లేకుండా ఒంటరిగా పోటీచేస్తే మాత్రమే జనసేన 175 సీట్లలో పోటీ చేయగలుగుతుంది. మరప్పుడు ఎన్నిసీట్లలో గెలుస్తుంది ? సో, ఏ రకంగా చూసినా 2024 ఎన్నికల్లో అయితే చిరంజీవి కోరిక నెరవేరే అవకాశం లేదు.

అయితే ఇదే సమయంలో మరో ప్రచారం కూడా మొదలైంది. బుధవారం రిలీజైన గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్లో భాగంగానే చిరంజీవి పవన్‌ను ఆకాశానికి ఎత్తేశాడని అంటున్నారు. ఈ మధ్యనే రిలీజైన సినిమా ఆచార్య బోల్తాపడింది. దాంతో ఈ సినిమా రిలీజ్ ముందు మెగాస్టార్ పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవటం కోసమే తమ్ముడి నిజాయితీ అని, నిబద్ధతని, సీఎం అని అన్నారని అంటున్నారు. తమ్ముడి గురించి, పవన్ భవిష్యత్తు ఏమిటో అన్నగా చిరంజీవి కన్నా బాగా తెలిసినవాళ్ళు ఇంకెవరుంటారు ?

First Published:  5 Oct 2022 7:44 AM GMT
Next Story