Telugu Global
Andhra Pradesh

వైసీపీ నేతలతో మాట్లాడాలన్నా చిరుకు ఇబ్బందేనా?.. ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి..?

తన తమ్ముడు పవన్ కళ్యాణ్ చాలా నిస్వార్థ‌పరుడని, డబ్బు, పదవుల మీద కూడా ఆశ ఉండ‌ద‌ని చిరంజీవి చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ తనకు బిడ్డ లాంటి వాడన్నారు.

వైసీపీ నేతలతో మాట్లాడాలన్నా చిరుకు ఇబ్బందేనా?.. ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి..?
X

సొంత అన్నదమ్ములైనప్పటికీ రాజకీయాల విషయంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ వైఖరులు వేర్వేరు అనుకునే వారికి తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. రాజకీయంగానూ తన తమ్ముడిని చిరంజీవి వెనుకేసుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ పై కొందరు మితిమీరి రాజకీయ విమర్శలు చేస్తున్నారని, వాటిని విన్నప్పుడు తనకు చాలా బాధనిపిస్తుందని ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పుకొచ్చారు. సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తన తమ్ముడు రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. అలాంటి వ్యక్తిపై మితిమీరిన విమర్శలు విన్నప్పుడు మనసు చివుక్కుమంటుందన్నారు.

తన తమ్ముడు పవన్ కళ్యాణ్ చాలా నిస్వార్థ‌పరుడని, డబ్బు, పదవుల మీద కూడా ఆశ ఉండ‌ద‌ని చిరంజీవి చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ తనకు బిడ్డ లాంటి వాడన్నారు. రాజకీయాలను ప్రక్షాళన చేసి ప్రజలకు మంచి చేయాలనే పవన్ కళ్యాణ్ రాజకీయ రంగం వైపు మళ్ళారని, అలాంటి వ్యక్తిపై మితిమీరిన విమర్శలు చేస్తున్న వారితో మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఉంటుందని చెప్పారాయన. "వాల్తేరు వీరయ్య' సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యల్లో తన తమ్ముడిని మితిమీరి విమర్శిస్తున్న వారితో మాట్లాడాలన్నా తనకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పడం ఆసక్తికరంగా ఉంది. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఎక్కువగా వైసీపీ వారే విమర్శిస్తూ ఉంటారు. పవన్‌ను దత్తపుత్రుడు అనడంతో పాటు ఆయన వివాహాల పైన ముఖ్యమంత్రి సైతం విమర్శలు చేస్తూ ఉంటారు. మరి తన తమ్ముడిని విమర్శించే వారితో మాట్లాడాలన్నా తనకు ఇబ్బందిగా ఉంటుంది అన్న వ్యాఖ్యలు ముఖ్యమంత్రిని, వైసీపీ నేతలను ఉద్దేశించేనా?.

తమ్ముడిని ఎవరైనా విమర్శిస్తే చిరంజీవికి బాధ కలగడంలో తప్పులేదు.. కానీ, తన సోదరులు కూడా అవతలి వారిని ఇష్టానుసారం దూషించినప్పుడు అవతలి వారికి కూడా బాధ కలిగి ఉంటుంది అన్న విషయాన్ని చిరంజీవి గుర్తించాల్సి ఉంది. ఎదుటి పక్షాన్ని పవన్ కళ్యాణ్ హద్దులు మీరు విమర్శించినప్పుడు కాస్త సంయమనం పాటించాల్సిందిగా అన్నగా చెప్పి ఉండాల్సింది.

First Published:  1 Jan 2023 12:52 PM GMT
Next Story