Telugu Global
Andhra Pradesh

వైసీపీకి 'చీరాల' చింత తీరినట్లేనా?

సీఎం జగన్ ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో పోతుల సునీతకు మరోసారి ఛాన్స్ ఇచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆమెకు చీరాల టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసినట్లు అయ్యింది.

వైసీపీకి చీరాల చింత తీరినట్లేనా?
X

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, సీఎం జగన్‌కు చాన్నాళ్లుగా చీరాల నియోజకవర్గ రాజకీయాలు కొరకరాని కొయ్యగా మారాయి. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా అక్కడి రాజకీయాలు తయారయ్యాయి. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్, ఎమ్మెల్సీ పోతుల సునీత.. చీరాలలో మూడు వర్గాలుగా చీలిపోయి రాజకీయం చేస్తుండటంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమకే చీరాల సీటు దక్కుతుందంటూ ముగ్గురూ బహిరంగంగా ప్రకటించుకోవడంతో అక్కడి వైసీపీలో గందరగోళం నెలకొన్నది.

గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన ఆమంచి కృష్ణ మోహన్ ఓడిపోయారు. ఇక ఆమంచిపై గెలిచిన కరణం బలరాం.. టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి చీరాలలో ఆమంచి, కరణం వర్గీయులు ఒకే పార్టీలో కొనసాగుతున్నా.. ప్రత్యర్థి వర్గాలుగా మారిపోయారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇరు వర్గాలు తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. అయితే వైసీపీ అధిష్టానం జోక్యంతో అప్పటికి వెనక్కు తగ్గారు. కానీ ఈ రెండు వర్గీయుల మధ్య మాత్రం సయోధ్య కుదరలేదు. సీఎం వైఎస్ జగన్ స్వయంగా ఆమంచిని పిలిచి పర్చూరుకు వెళ్లి పని చేసుకోవాలని సూచించారు. అయినా, ఆమంచి మాత్రం అటువైపు చూడలేదు.

రాబోయే ఎన్నికల్లో కరణం బలరాం కొడుకు కరణం వెంకటేశ్ చీరాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కరణం వెంకటేశ్‌నే చీరాల వైసీపీ ఇంచార్జిగా ప్రకటించడంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలోనే కొనసాగింది. అయితే ఆమంచిని పర్చూరుకు వెళ్లమని చెప్పినా ఆయన మాత్రం చీరాలలోనే ఉండిపోయారు. అదే సమయంలో ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా చీరాలలో మరో వర్గాన్ని తయారు చేసి రాజకీయం మొదలు పెట్టారు.

కాగా, సీఎం జగన్ ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో పోతుల సునీతకు మరోసారి ఛాన్స్ ఇచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆమెకు చీరాల టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసినట్లు అయ్యింది. మరోవైపు ఆమంచి కూడా పర్చూరుకు వెళ్లి పని మొదలు పెట్టారు. చీరాలలో ఇన్నాళ్లు టికెట్ కోసం పోటీ పడిన ఇద్దరు కూడా సైడ్ అయిపోవడంతో కరణం వెంకటేశ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. చీరాలలోని బీసీ ఓటర్లను సంతృప్తి పరచడానికే పోతుల సునీతకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఆమంచిని పర్చూరులో సర్దుబాటు చేయడంతో ఆయన చీరాలలో వర్గ రాజకీయాలు చేయడానికి వీలు లేకుండా పోయింది.

ఇటీవల జరిగిన నియోజకవర్గ సమప్వయ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్లు బీద మస్తాన్‌రావు, భూమన కరుణాకర్ రెడ్డి.. చీరాల నుంచి కరణం వెంకటేశ్ పోటీ చేస్తారని చెప్పారు. సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వారిద్దరూ ఆ మేరకు ప్రకటన చేశారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి గత మూడేళ్లుగా పార్టీని, సీఎం జగన్‌ను ఇబ్బంది పెట్టిన చీరాల నియోజకవర్గానికి పరిష్కారం దొరికింది. ఇకపై అక్కడ గ్రూపు తగాదాలు ఉండబోవని.. ఎవరి పని వారు చేసుకొని పోతారని అధిష్టానం భావిస్తోంది. అయితే, కరణం వెంకటేశ్‌కు పోతుల సునీత పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది. కానీ, అధిష్టానం మాటను ధిక్కరించి తిరిగి గ్రూపు రాజకీయాలు చేస్తే కఠిన చర్యలు తప్పదనే సంకేతం కూడా ఆమెకు పంపినట్లు తెలుస్తున్నది.

First Published:  22 Feb 2023 7:20 AM GMT
Next Story