Telugu Global
Andhra Pradesh

ఇక్కడి నేతలు అటు.. అక్కడి నేతలు ఇటు.. ఊపందుకున్న జంపింగ్‌లు

టికెట్‌ దక్కదనుకుంటున్న నాయకులు పార్టీలు మారుతున్నారు. వైసీపీకి చెందిన నాయకులు టీడీపీలోకి వెళ్తుండగా.. టీడీపీకి చెందిన నాయకులు వైసీపీలోకి వస్తున్నారు.

ఇక్కడి నేతలు అటు.. అక్కడి నేతలు ఇటు.. ఊపందుకున్న జంపింగ్‌లు
X

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. టికెట్‌ దక్కదనుకుంటున్న నాయకులు పార్టీలు మారుతున్నారు. వైసీపీకి చెందిన నాయకులు టీడీపీలోకి వెళ్తుండగా.. టీడీపీకి చెందిన నాయకులు వైసీపీలోకి వస్తున్నారు. ఇవాళ టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. తన రాజీనామాను ఆమోదించిన అనంతరం వైసీపీలో చేరతానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు, లోకేష్‌పై తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడ ఎంపీ స్థానాన్ని చంద్రబాబు తన కుటుంబసభ్యుడికి ఇవ్వాలని అనుకున్నారని మండిపడ్డారు.

ఇక వైసీపీకి చెందిన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన టీడీపీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. జగన్ తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పినందుకు వైసీపీని వీడుతున్నట్లు ఆయన చెబుతున్నట్లు సమాచారం. పార్థసారథి టీడీపీలో చేరి నూజివీడు నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారని తెలుస్తోంది.

వైసీపీ నుంచి గుంటూరు పార్ల‌మెంట్ అభ్య‌ర్థిగా పోటీ చేయాలని భావించిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పార్టీ అధిష్టానం నుంచి హమీ రాకపోవడంతో వైసీపీకి రాజీనామా చేశారు. ఇవాళ ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. అంబటి రాయుడు జనసేనలో చేరి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.

వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కూడా ఇటీవల జనసేనలో చేరారు. వైసీపీ నుంచి టికెట్ హామీ రాకపోవడంతో ఆయన జనసేనలో చేరారని తెలుస్తోంది. ఇలా పలువురు నాయకులు టికెట్ల కోసం ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ జంపింగ్ లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

First Published:  10 Jan 2024 1:47 PM GMT
Next Story