Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకి సారీ చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు..

పోలీసులపై కూడా తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో చంద్రశేఖర్ రెడ్డి కాస్త వెనక్కి తగ్గారు. జిల్లా ఎస్పీని కలసిన అనంతరం ఆయన మీడియా ముందు క్షమాపణలు చెప్పారు.

చంద్రబాబుకి సారీ చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు..
X

చంద్రబాబుని వైసీపీ నేతలు చాలామంది చాలా రకాలుగా తిడుతుంటారు, కామెంట్లు చేస్తుంటారు. టీడీపీ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు పడుతున్నా.. ఈ విషయంలో వైసీపీదే పైచేయి అని చెప్పాలి. ఓ దశలో చంద్రబాబుని ఎంత తిడితే జగన్ దగ్గర ఆ నాయకులకు అంత మైలేజీ అనే చర్చ కూడా నడిచింది. చంద్రబాబుని చెడామడా తిట్టేవారికే జగన్ తన మంత్రివర్గంలో స్థానం ఇచ్చారనే ఆరోపణ కూడా ఉంది. ఈ విషయాలన్నీ పక్కనపెడితే ఇటీవల చంద్రబాబుపై చేసిన ఘాటు వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు క్షమాపణ చెప్పడం విశేషం. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు.

అసలేం జరిగింది..?

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి అప్పట్లో మొద్దు శీనుకు ఒక్కమాట చెప్పుంటే చంద్రబాబును ఇంట్లోకి దూరి చంపేసేవాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము హత్యా రాజకీయాలు చేయాలనుకుంటే లోకేష్ తోనే మొదలు పెడతామని కూడా అన్నారు. దీంతో టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో చంద్రశేఖర్ రెడ్డిని విమర్శించిన టీడీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. పోలీసులపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో చంద్రశేఖర్ రెడ్డి కాస్త వెనక్కి తగ్గారు. జిల్లా ఎస్పీని కలసిన అనంతరం ఆయన మీడియా ముందు క్షమాపణలు చెప్పారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదేశిస్తే మొద్దు శీను పని పూర్తిచేసేవాడని చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే అభ్యంతరకరంగా మారాయి. దీంతో ఆయన దిగిరావాల్సి వచ్చింది. అందులోనూ టీడీపీ నుంచి ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. పరిటాల సునీత, శ్రీరామ్ సహా ఇతర నేతలంతా పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాకు దిగారు. రెండురోజులపాటు ఆందోళనలు మిన్నంటిన తర్వాత ఎట్టకేలకు చంద్రశేఖర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు.

గతంలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల విషయంలో టీడీపీనుంచి గెలిచి, వైపీసీవైపు వెళ్లిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు క్షమాణలు చెప్పడం గమనార్హం. నేరుగా చంద్రబాబుకి సారీ చెప్పకపోయినా, తమ మాటలతో వారు నొచ్చుకుని ఉంటే క్షమించాలని అన్నారు. అదే సమయంలో ఐ-టీడీపీ పేరుతో తమని కూడా చాలామంది తిడుతున్నారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

First Published:  29 Nov 2022 6:10 AM GMT
Next Story