Telugu Global
Andhra Pradesh

పోటీకి మాత్రమేనా వెనకబడిన ప్రాంతం ?

చంద్రబాబు బావమరిది కమ్ వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ కూడా అచ్చంగా ఇలాగే వ్యవహరిస్తున్నారు. పోటీకి మాత్రం మరో వెనకబడిన జిల్లా అయిన అనంతపురంలోని హిందూపురం నియోజకవర్గమే కావాలి. రాజధానిగా మాత్రం అమరావతే ఉండాలంటారు.

పోటీకి మాత్రమేనా వెనకబడిన ప్రాంతం ?
X

40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. పుట్టి పెరిగిన చంద్రగిరి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. సొంత జిల్లా చిత్తూరును పట్టించుకోరు. కానీ పోటీచేయటం మాత్రం జిల్లాలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గమైన కుప్పం నుండే చేస్తారు. ఇదే సమయంలో రాజధానిగా మాత్రం బాగా అభివృద్ధి చెందిన గుంటూరు-విజయవాడ మధ్యలోని అమరావతి మాత్రమే ఉండాలంటారు.

అలాగే చంద్రబాబు బావమరిది కమ్ వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ కూడా అచ్చంగా ఇలాగే వ్యవహరిస్తున్నారు. పోటీకి మాత్రం మరో వెనకబడిన జిల్లా అయిన అనంతపురంలోని హిందూపురం నియోజకవర్గమే కావాలి. రాజధానిగా మాత్రం అమరావతే ఉండాలంటారు. మొత్తానికి బావ, బావమర్ది పోటీచేయటానికి మాత్రం వెనకబడిన నియోజకవర్గాలను ఎంపికచేసుకుని రాజధానిగా అమరావతే ఉండాలని డిమాండ్లు చేస్తున్నారు.

సమైక్య రాష్ట్రంలో డెవలప్మెంట్ అంతా హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లోనే జరిగింది. అంటే 22 జిల్లాల ఆదాయమంతా తెచ్చి అప్పటిపాలకులు హైదరాబాద్ తో పాటు మహానగరం చుట్టుపక్కల మాత్రమే డెవలప్ చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అప్పటి పాలకులు చేసిన తప్పేమిటో జనాలందరికీ తెలిసొచ్చింది. అయితే అప్పటికే చేతులు కాలిపోయాయి కాబట్టి చేయగలిగింది కూడా ఏమీలేకపోయింది. అందుకనే విభజన నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని వేసి సీమాంధ్ర అభివృద్ధిపై రిపోర్టిమ్మని చెప్పింది. అలాగే కమిటీ రాష్ట్రమంతా తిరిగి నిపుణులు, మేథావులు, మామూలు జనాల అభిప్రాయాలను తీసుకున్నది.

అయితే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు యూపీఏ కమిటీని దానిపని దానిని చేసుకోనివ్వలేదు. దాంతో కమిటీ తన బాధ్యతలను మధ్యలోనే వదిలేసి కేంద్రానికి నివేదిక ఇచ్చేసింది. కమిటీ ఏమి చెప్పిందనే విషయాన్ని వదిలేస్తే మళ్ళీ డెవలప్మెంట్ అంతా చంద్రబాబు అమరావతి, అమరావతి చుట్టుపక్కలే చేయటం మొదలుపెట్టారు. దాంతో రాయలసీమ, ఉత్తరాంధ్రలో అసంతృప్తి మొదలైంది. కారణాలు ఏవైనా తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ప్రతిపాదిస్తే చంద్రబాబు అండ్ కో వ్యతిరేకిస్తున్నారు. దీన్నిబట్టి అర్థ‌మవుతున్నదేమంటే పోటీకిమాత్రమే చంద్రబాబుకు వెనకబడిన ప్రాంతం కావాలి. రాజధాని మాత్రం అమరావతే ఉండాలని.

First Published:  10 Oct 2022 2:58 AM GMT
Next Story