Telugu Global
Andhra Pradesh

రెబల్‌గా మహాసేన.. చంద్రబాబు కొత్త డ్రామా!

మొన్నటి వరకు టీడీపీలో ఉంటూ ప్రత్యర్థులపై విమర్శల దాడి చేసిన మహాసేన రాజేష్‌ ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. పి. గన్నవరంలో టీడీపీ తరఫున అభ్యర్థిగా ప్రకటన చేసిన తర్వాత మారిన పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకున్నారు.

రెబల్‌గా మహాసేన.. చంద్రబాబు కొత్త డ్రామా!
X

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది. ఏ సర్వే చూసినా జగన్‌కే జై కొడుతుండటంతో కూటమి కుదేలవుతోంది. గెలుపుపై దింపుడు కళ్లం ఆశలతో చంద్రబాబు మహాసేన రాజేష్‌ను రంగంలోకి దింపారు. జగన్‌వైపు బలంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓటు బ్యాంకును చీల్చేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. టీడీపీ నుంచి మహాసేనను బయటకు పంపించి రెబల్‌గా పోటీ చేయించేందుకు సిద్ధమయ్యారు.

మొన్నటి వరకు టీడీపీలో ఉంటూ ప్రత్యర్థులపై విమర్శల దాడి చేసిన మహాసేన రాజేష్‌ ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. పి. గన్నవరంలో టీడీపీ తరఫున అభ్యర్థిగా ప్రకటన చేసిన తర్వాత మారిన పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి సైలెంట్‌గా ఉంటున్న రాజేష్‌ ఇప్పుడు ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. తను టీడీపీని వీడబోతున్నట్లు.. అన్ని నియోజకవర్గాల్లో రెబల్‌గా బరిలోకి దిగబోతున్నట్లు స్పష్టం చేశారు.

మహాసేన రాజేష్‌ తన ఫేస్‌బుక్‌లో ఏం రాసుకొచ్చారంటే.. "నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్‌ని, ఎస్సీకి TDP రాష్ట్ర లీడర్‌ని. మా పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ లేదా స్టేట్‌ ఛైర్మన్ అవుతాను. అయినా సరే ఈ గౌరవం నాకు ఇచ్చిన చంద్రబాబుకి క్షమాపణ చెప్పి పార్టీ నుండి బయటకు రావడానికి సిద్ధం.

కారణం..?

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా కీలకం. దేశమంతా ప్రతీ రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రతిపక్షం ఉంది. గుజరాత్‌లో కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రత్యర్థులు. కానీ ఆంధ్రలో మాత్రం బీజేపీకి ప్రతిపక్షం లేదు. ఇది ప్రజల ఓటు హక్కుని హరించడమే. ఇక్కడ ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకే పడుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి అనుకున్న వారికి ఆ అవకాశాన్ని దూరం చేయకూడదు. ఈ కారణంగా మేం 2024 ఎలక్షన్‌లో మాకు అవకాశం ఉన్న ప్రతీ నియోజకవర్గంలో పోటీకి దిగాలని అనుకుంటున్నాం. 100 నియోజకవర్గాల్లో పోటీకి సిద్దమయ్యాం. 50 సీట్లలో ముస్లిం అభ్యర్థుల్ని పోటీ చేయిస్తున్నాం. ఉనికి కోసం, ఆత్మ గౌరవం కోసమే మా పోటీ" అంటూ చంద్రబాబు డైరెక్షన్‌లో కొత్త నాటకానికి తెరలేపారు మహాసేన రాజేష్.

First Published:  6 April 2024 4:56 AM GMT
Next Story