Telugu Global
Andhra Pradesh

సెంట్రల్ జైలులో చంద్రబాబు ఫస్ట్ కంప్ల‌యింట్.. ఆలస్యంగా వెలుగులోకి

వాస్తవానికి చంద్రబాబుకి జైలులో కల్పిస్తున్న సౌకర్యాలపై మొదటి నుంచి అతని కుటుంబ సభ్యులు, టీడీపీ నేత‌లు ఆందోళన వ్యక్తం చేశారు.

సెంట్రల్ జైలులో చంద్రబాబు ఫస్ట్ కంప్ల‌యింట్.. ఆలస్యంగా వెలుగులోకి
X

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు అక్కడ వైద్యాధికారికి చేసిన ఫిర్యాదు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహా బ్లాక్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉన్న చంద్రబాబు.. జైల్లో ఉక్కపోత హెచ్చుతగ్గుల కారణంగా డీహైడ్రేషన్‌కు గురయ్యారు. దాంతో ఫ్యాన్ లేకపోవడంతోనే తాను ఇలా డీహైడ్రేషన్‌కి గురయ్యానని వైద్యాధికారికి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఈ విషయం బాబుతో మంగళవారం ములాఖత్ అయిన కుటుంబ సభ్యుల ద్వారా బయటికి వచ్చింది.

భువనేశ్వరి సెంటిమెంట్ మాటలు

వాస్తవానికి చంద్రబాబుకి జైలులో కల్పిస్తున్న సౌకర్యాలపై మొదటి నుంచి అతని కుటుంబ సభ్యులు, టీడీపీ నేత‌లు ఆందోళన వ్యక్తం చేశారు. వేడినీళ్లు ఇవ్వడం లేదు.. దోమలు కుడుతున్నాయి.. ఏసీ సౌకర్యం లేదంటూ గ‌గ్గోలు పెట్టారు. కానీ.. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు బాబుకు ఇంటి భోజనం, మెడిసిన్స్‌తో పాటు కొన్ని అదనపు సదుపాయాలు మాత్రం జైలు అధికారులు కల్పిస్తున్నారు. అయితే.. భువనేశ్వరి ములాఖత్ అయిన ప్రతిసారి జైలులో బాబుకి సంబంధించి ఏదో ఒక కొత్త విషయాన్ని ప్రస్తావిస్తూ సెంటిమెంట్‌గా మాట్లాడుతున్నారు. గత ములాఖత్‌లోనూ ఆయన కట్టించిన జైలులోనే ఆయనను కట్టిపడేశారు అంటూ సెంటిమెంట్‌గా మాట్లాడిన విషయం తెలిసిందే.

మళ్లీ బ్రాహ్మణితో బాబు ములాఖత్

జైల్లో ఉన్న చంద్రబాబుని ములాఖత్‌లో ఎవరు కలిసినా.. వారి వెంట నారా బ్రాహ్మణి ఉండటం పరిపాటిగా మారిపోయింది. మంగళవారం నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణితో పాటు పయ్యావుల కేశవ్ ములాఖత్‌లో చంద్రబాబుని కలిశారు. గత వారం రోజులుగా పార్టీ కార్యక్రమాలతో పాటు నారా లోకేష్ సీఐడీ విచారణ గురించి కూడా బాబుకి వాళ్లు వివరించినట్లు తెలుస్తోంది. అలానే ఈ వీకెండ్‌లో చేపట్టబోయే నిరసన కార్యక్రమం గురించి కూడా బాబుకి చెప్పి.. అనుమతి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బాబులో పెరుగుతున్న టెన్షన్

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు జైలుకి వెళ్లి ఇప్పటికే దాదాపు నెల గడిచిపోయింది. సాక్ష్యాధారాలు బలంగా ఉండటంతో బాబు తరఫున హైకోర్టు, సుప్రీంకోర్టులో అతని లాయర్లు వేస్తున్న క్వాష్ పిటీషన్లు తిర‌స్క‌ర‌ణ‌కు గురవుతున్నాయి. దాంతో బాబులోనూ ఆందోళ‌న పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తగినంత విశ్రాంతి లేకపోవడంతో బాబు ఇలా స్వల్ప అస్వస్థతకి గురైనట్లు కూడా వాదనలు వినిపిస్తున్నాయి.

First Published:  11 Oct 2023 3:14 AM GMT
Next Story