Telugu Global
Andhra Pradesh

2014-19 మధ్య రాకెట్ వేగంతో పెరిగిన చంద్రబాబు ఆస్తులు

2019లో సమర్పించిన అఫిడవిట్‌లో తనకు రూ.668 కోట్ల ఆస్తులు ఉన్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రూ.15 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు.

2014-19 మధ్య రాకెట్ వేగంతో పెరిగిన చంద్రబాబు ఆస్తులు
X

స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు గురించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 2019లో చంద్రబాబు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారం.. ఐదేళ్లలోనే ఆయన ఆస్తులు రూ.491 కోట్ల మేర పెరిగాయి. 2014 ఎన్నికల సమయంలో ఆయన ఆస్తులు రూ.177 కోట్లుగా ఉండగా.. 16 కోట్ల అప్పులు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2014 అఫిడవిట్‌ ప్రకారం దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఆయన రికార్డులకెక్కారు.

ఇక 2019లో సమర్పించిన అఫిడవిట్‌లో తనకు రూ.668 కోట్ల ఆస్తులు ఉన్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రూ.15 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. అంటే 2014-19 మధ్య ఆయన ఆస్తులు రూ. 491 కోట్ల మేర పెరిగాయి. 2019లో దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు చంద్రబాబు. ప్రస్తుతం స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అవినీతికి పాల్పడినట్లు చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ADR రిపోర్టు ప్రకారం కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డి.కె.శివకుమార్ దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా ఉన్నారు. 2023 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం శివకుమార్ ఆస్తుల విలువ రూ. 1,413 కోట్లుగా ఉంది. రెండోస్థానంలో కర్ణాటక ఎమ్మెల్యే పుట్టస్వామి గౌడ రూ.1,267 కోట్లు, కర్ణాటక కాంగ్రెస్‌కు చెందిన ప్రియా కృష్ణ రూ.1,156 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఇక నాలుగో స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు.

28 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4,001 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను పరిశీలించి ADR ఈ రిపోర్టు తయారు చేసింది. టాప్‌ -10 ధనికఎమ్మెల్యేల్లో నలుగురు కాంగ్రెస్‌కు చెందిన వారు ఉండగా.. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలున్నారు.

First Published:  16 Sep 2023 1:37 AM GMT
Next Story