Telugu Global
Andhra Pradesh

డబ్బుకు చంద్రబాబు దాసోహం.. టికెట్ల కేటాయింపులో ద్వంద్వ వైఖరి

జేసీ దివాకర్‌ రెడ్డి విషయంలోనూ చంద్రబాబు అదే పని చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. జేసీ దివాకర్‌ రెడ్డి కుమారుడు జేసీ పవన్‌ రెడ్డికి అనంతపురం లోక్‌సభ సీటు ఇప్పించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

డబ్బుకు చంద్రబాబు దాసోహం.. టికెట్ల కేటాయింపులో ద్వంద్వ వైఖరి
X

పార్టీ టికెట్ల కేటాయింపులో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరి అవలంభించారు. కొంత మంది సీనియర్‌ నాయకుల విషయంలో ఒక కుటుంబానికి ఒకే టికెట్‌ విధానాన్ని వర్తింపజేసి, కొంత మందికి మినహాయింపు ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.

మాజీ మంత్రులు పరిటాల సునీత, జేసీ దివాకర్‌ రెడ్డి, అయ్యన్నపాత్రుడు వంటి సీనియర్‌ నాయకుల ఆశలపై ఆయన నీళ్లు చల్లారు. తమ పట్ల చంద్రబాబు వివక్ష ప్రదర్శించారనే భావనకు వారు గురయ్యారు. పరిటాల సునీతకు రాప్తాడు అసెంబ్లీ సీటు కేటాయించిన చంద్రబాబు ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్‌కు మొండిచేయి చూపారు. పరిటాల శ్రీరామ్‌ ధర్మవరం సీటును ఆశించారు. అయితే ఆ సీటును బీజేపీకి కేటాయించారు. బీజేపీ నుంచి వరదాపురం సూరి ధర్మవరం సీటును ఆశిస్తున్నారు.

జేసీ దివాకర్‌ రెడ్డి విషయంలోనూ చంద్రబాబు అదే పని చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. జేసీ దివాకర్‌ రెడ్డి కుమారుడు జేసీ పవన్‌ రెడ్డికి అనంతపురం లోక్‌సభ సీటు ఇప్పించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. తాడిపత్రి శాసనసభ సీటును జేసీ ప్రభాకర్‌ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌ రెడ్డికి కేటాయించారు. దీంతో ఆయనకు టికెట్‌ వస్తుందా, లేదా అనేది అనుమానంగానే ఉంది. టీడీపీ సీనియర్‌ నాయకుడు అయ్యన్నపాత్రుడి కుమారుడు అనకాపల్లి సీటును ఆశిస్తున్నారు. అయితే, ఈ సీటు ఆయనకు దక్కుతుందా, లేదా అనేది ఆనుమానంగానే ఉంది.

తన కుటుంబానికి వచ్చేసరికి చంద్రబాబు ద్వంద్వ వైఖ‌రిని ప్రదర్శించారు. నారా, నందమూరి కుటుంబాలకు నాలుగు టికెట్లు దక్కాయి. చంద్రబాబు (కుప్పం), నారా లోకేష్‌ (మంగళగిరి), బాలకృష్ణ (హిందూపురం), బాలకృష్ణ అల్లుడు గీతం భరత్‌ (విశాఖ లోకసభ సీటు) ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.

టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు కుటుంబం భారీ వాటానే పొందింది. రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కూతురు దివ్యకు తుని అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. ఆమె భర్త పుట్టా మహేష్‌ యాదవ్‌కు ఏలూరు లోక్‌సభ స్థానాన్ని ఇచ్చారు. యనమల రామకృష్ణుడి వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మైదుకూరు శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ధనబలం కారణంగానే ఈ కుటుంబానికి చంద్రబాబు ఎక్కువ సీట్లు కేటాయించారనే ప్రచారం జరుగుతోంది.

ఇటీవలే టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డికి లోక్‌సభ స్థానాన్ని, ఆయన భార్య‌కి అసెంబ్లీ సీటును కేటాయించారు. మొత్తం మీద, చంద్రబాబు ధనబలానికి పెద్ద పీట వేశారనే విమర్శలు వస్తున్నాయి.

First Published:  23 March 2024 12:16 PM GMT
Next Story