Telugu Global
Andhra Pradesh

వలంటీర్లంటే ఇంత భయపడుతున్నారా?

ఏ వ్యవస్థ అయినా ప్రారంభించిన‌ప్పుడు జనాలో కాస్త వ్యతిరకత రావటం సహజం. కానీ వలంటీర్ల వ్యవస్థ‌పై జనాల్లో వ్యతిరేకత కనబడ‌లేదు. ఎందుకంటే వీళ్ళందిస్తున్న సర్వీసు బాగుంది కాబట్టే.

వలంటీర్లంటే ఇంత భయపడుతున్నారా?
X

వలంటీర్ల వ్యవస్థ‌ అంటే చంద్రబాబునాయుడు, ఎల్లో మీడియాలో ఉన్న భయం ఇప్పుడు పవన్ కల్యాణ్ రూపంలో బయటపడుతోంది. వలంటీర్ల వ్యవస్థ‌ మొదలుపెట్టిన దగ్గర నుండి దీన్న ఎలా దెబ్బకొట్టాలో అర్థంకాక చంద్రబాబు, ఎల్లో మీడియా నానా అవస్థ‌లు పడుతున్నారు. మొదట్లో దీనిపై చంద్రబాబు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే అప్పటికే జనాల్లో వలంటీర్లపైన సానుకూలత ఉన్న కారణంగా 40ఇయర్స్ ఇండస్ట్రీ ఏమీ చేయలేకపోయారు.

వలంటీర్ల వల్ల ఎక్కడ చిన్న తప్పు జరిగినా ఎల్లో మీడియా దాన్ని బూతద్దంలో చూపిస్తోంది. ప్రభుత్వం కూడా స్పందించి తప్పుచేసిన వలంటీర్లపై వెంటనే యాక్షన్ తీసుకుంటోంది. దాంతో వలంటీర్లంటే జనాల్లో సానుకూల స్పందన ఉందే తప్ప వ్యతిరేకత లేదు. ఇలాంటి వలంటీర్ల వల్ల రాబోయే ఎన్నికల్లో తమకు ఇబ్బందులు తప్పవని చంద్రబాబు భయపడుతున్నారు. ప్రతి 50 ఇళ్ళకు ఒక వలంటీరు పనిచేస్తు ప్రభుత్వ పథకాలు సదరు కుటుంబాలకు అందేట్లుగా చూస్తున్నారు. వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే తన పరిధిలో అయ్యేట్లుంటే వెంటనే పరిష్కరిస్తున్నారు.

రేపటి ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా సదరు కుటుంబాల వాళ్ళు ఓట్లేసేట్లుగా 2.5 లక్షల మంది వలంటీర్లు ప్రభావితం చేయగలరని ఎల్లో మీడియా, చంద్రబాబులో భయం పెరిగిపోతోంది. అందుకనే ఎన్నికల నిర్వహణ నుండి వలంటీర్లను దూరంగా ఉండాలని పదేపదే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేశారు. ఇంతకుమించి వీళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తెరవెనుక నిలబడి ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను రెచ్చగొడుతున్నట్లున్నారు. పవన్ కూడా ముందు వెనుక ఆలోచించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు.

వలంటీర్ల వ్యవస్థ‌ అవసరంలేదని పవన్ చెప్పటంలో తప్పులేదు. వ్యక్తిగత సమాచారం ఇవ్వద్దని అనటం వల్ల ఉపయోగంలేదు. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ పథకం అందాలన్నా ఆధార్ కార్డుతో పాటు వ్యక్తిగత సమాచారం ఇవ్వక తప్పదు. కాబట్టి పవన్ చెప్పినా లబ్దిదారులు ఎవరు వినరు. అందుకనే వలంటీర్లపై జనాలను రెచ్చగొట్టడంలో భాగంగానే హ్యూమన్ ట్రాఫికింగ్‌కు వలంటీర్లే కారణమని నోటికొచ్చిన ఆరోపణ చేశారు. అంటే వలంటీర్ల వ్యవస్థ‌పై జనాల్లో వ్యతిరేకత పెంచటానికి హ్యూమన్ ట్రాఫికింగ్‌ను జోడించినట్లు అర్థ‌మవుతోంది.

పైగా తాను వలంటీర్ వ్యవస్థ నడుం విరగొట్టి తీరుతానని ప్రకటించటమే విచిత్రంగా ఉంది. ఈ వ్యవస్థ‌కు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేస్తానని చెప్పారు. ఏ వ్యవస్థ‌యినా ప్రారంభించిన‌ప్పుడు జనాలో కాస్త వ్యతిరకత రావటం సహజం. ఒకప్పుడు ఎన్టీయార్ మునుసబు, కరణాల స్థానంలో మండల వ్యవస్థ‌ను తెచ్చినప్పుడు కూడా జనాల్లో వ్యతిరేకత వచ్చింది. అయితే కొంతకాలం పోయిన తర్వాత జనాలు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ ఇక్కడ వలంటీర్ల వ్యవస్థ‌పై జనాల్లో వ్యతిరేకత కనబడ‌లేదు. ఎందుకంటే వీళ్ళందిస్తున్న సర్వీసు బాగుంది కాబట్టే. మొత్తానికి తమలోని భయాన్ని, అక్కసును అందరు కలిసి పవన్ ద్వారా బయటపెట్టుకున్నట్లే ఉంది.

First Published:  12 July 2023 6:15 AM GMT
Next Story