Telugu Global
Andhra Pradesh

నాటి ఒప్పులు, నేటి తప్పులు.. చంద్రబాబు డబుల్ గేమ్..

సీపీఎస్ రద్దు చేయాలంటూ ఆయన చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు లేఖ రాశారు. ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారని, ఆ ప్రకారం సీపీఎస్ రద్దు చేయాలంటూ ఉద్యోగులకు మద్దతు తెలిపారు చంద్రబాబు.

నాటి ఒప్పులు, నేటి తప్పులు.. చంద్రబాబు డబుల్ గేమ్..
X

చంద్రబాబు డబుల్ గేమ్ మొదలు పెట్టారు. నిన్న మొన్నటి వరకూ వైసీపీ విధానాలను తప్పుబడుతూ వచ్చిన చంద్రబాబు, ఇప్పుడు అవే విధానాలను తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటున్నారు. తాను అధికారంలో ఉండగా ఒప్పుగా కనిపించినవి, నేడు తప్పులని ఆయనకు అనిపిస్తున్నాయి. వైసీపీపై విమర్శలు చేసే క్రమంలో తనకు తానే ప్రజలముందు పలుచన అవుతున్నారు చంద్రబాబు.

సీపీఎస్ రద్దు చేయాలి..

సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న పోరాటం ఇప్పటిది కాదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. కానీ అప్పుడు చంద్రబాబుకి ఆ ఆవేదన పట్టలేదు, లైట్ తీసుకున్నారు. అప్పటి ప్రజాబాటలో ఉన్న జగన్ ఉద్యోగులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే వారం రోజుల్లోగా సీపీఎస్ రద్దు చేస్తానన్నారు. కానీ ఇప్పుడు జగన్ కి అది సాధ్యం కావడంలేదు. సీపీఎస్ రద్దు చేస్తే ఖజానాపై పడే భారాన్ని జగన్ సర్కారు తట్టుకునేలా లేదు. అందుకే ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకత‌ వస్తుందని తెలిసినా సీపీఎస్ రద్దు కుదరదు, దాని బదులు జీపీఎస్ అంటూ కొత్తపల్లవి అందుకున్నారు.

సందట్లో సడేమియా..

ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య జరుగుతున్న గొడవలో తలదూర్చారు చంద్రబాబు. సీపీఎస్ రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బెదిరింపులు, బైండోవర్లు తక్షణం నిలిపివేయాలని, సీపీఎస్ రద్దు చేయాలంటూ ఆయన చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు లేఖ రాశారు. ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారని, ఆ ప్రకారం సీపీఎస్ రద్దు చేయాలంటూ ఉద్యోగులకు మద్దతు తెలిపారు చంద్రబాబు.

ఆ అర్హత ఉందా..?

తాను అధికారంలో ఉన్నప్పుడు సీపీఎస్ రద్దు గురించి పట్టించుకోని చంద్రబాబు, ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడాన్ని ఎలా చూడాలి. సీపీఎస్ రద్దుకోసం అప్పట్లో ఉద్యోగ సంఘాలు పోరాటం చేస్తే, పూర్తిగా ఆ విషయాన్ని పక్కనపెట్టారు చంద్రబాబు, ఖజానాపై భారం పడుతుందని దాటవేశారు. అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. ఈ ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చోకోవాలని ఎవరూ చెప్పరు కానీ, ఇలాంటి కప్పదాటు వ్యవహారాలే చంద్రబాబు ఇమేజ్ ని డ్యామేజీ చేస్తున్నాయి.

నవరత్నాలు ప్లస్..

కొంతకాలంగా నవరత్నాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు. ఏపీ మరో శ్రీలంకలా తయారవుతుందన్నారు. కానీ కుప్పంలో మాత్రం చంద్రబాబు నవరత్నాలని మెచ్చుకున్నారు. తాను అధికారంలోకి వస్తే అంతకంటే ఎక్కువే ఇస్తానన్నారు. 2014నుంచి 2019 వరకు విభజిత ఏపీలో చంద్రబాబే సీఎం. మరి ఆ ఐదేళ్లు ఏం చేశారు, అప్పుడెందుకు నవరత్నాలు అనే ఆలోచన చంద్రబాబుకి రాలేదని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. అరకొర రుణమాఫీ, ఎన్నికలప్పుడు పసుపు-కుంపుమ విదిలింపు.. ఇలా సాగింది చంద్రబాబు వ్యవహారం. అందుకే 23 సీట్లకు పరిమితం అయ్యారు. ఇప్పుడు నవరత్నాలకంటే ఎక్కువ మేలు చేస్తానంటూ నమ్మబలుకుతున్నారు.

First Published:  31 Aug 2022 3:55 AM GMT
Next Story