Telugu Global
Andhra Pradesh

మూడు నెలల్లో నేనే సీఎం.. చంద్రబాబు ఏం మారలేదు

తాను అధికారంలోకి వచ్చాక పరిహారం ఇస్తానంటూ చంద్రబాబు బింకాలు పలుకుతున్నారు. తుపాను రాజకీయాలు మొదలు పెట్టారు.

మూడు నెలల్లో నేనే సీఎం.. చంద్రబాబు ఏం మారలేదు
X

జైలుకెళ్లొచ్చిన చంద్రబాబులో కాస్తో కూస్తో మార్పు వచ్చి ఉంటుందని అనుకున్నారంతా. ఆయన పూర్తి స్థాయిలో బయటకు వచ్చి రాజకీయ ప్రసంగాలు మొదలుపెట్టే సరికి అలాంటి మార్పేమీ లేదని స్పష్టమైంది. "మూడు నెలల్లో నేనే సీఎం నేనే వచ్చి మీ అందరికీ నష్టపరిహారం ఇస్తా"నంటూ తుపాను బాధితులతో చంద్రబాబు చెప్పడమే దీనికి నిదర్శనం. టీడీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు బలంగా నమ్మడంలో ఇబ్బంది లేదు కానీ, అన్నీ అప్పుడే చేస్తానంటూ రైతులకు బూటకపు హామీలివ్వడమే వింత, విడ్డూరం.

చంద్రబాబుని నమ్మేదెలా..?

2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడానికి ప్రధాన కారణం రుణమాఫీ హామీని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం. 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ చేస్తానంటూ హామీ ఇచ్చారు చంద్రబాబు, జగన్ ఆ ధైర్యం చేయలేదు. రైతులు చంద్రబాబు హామీ నమ్మి టీడీపీకి ఓటు వేశారు, తీరా అధికారంలోకి వచ్చాక సవాలక్ష కండిషన్లు పెట్టారు, సగానికి సగం మంది అనర్హులయ్యారు. మిగతావారికి కూడా విడతల వారీగా డబ్బులు వేశారు. రైతుల్ని చంద్రబాబు దారుణంగా మోసం చేశారు. ఆ మోసానికి 2019లో రైతులు బదులు తీర్చుకున్నారు. మిగతా హామీల అమలులో కూడా చంద్రబాబు పిల్లిమొగ్గలు వేసినా, రుణమాఫీ మోసం మాత్రం రైతులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే ప్రధానంగా రైతాంగం చంద్రబాబు మాటలు నమ్మదు. ఇప్పుడు తుపాను బాధిత రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీ కూడా ఇలాంటిదే.

తుపాను వెలిసి వారం రోజులు కూడా కాలేదు, ఇప్పటికే నష్టపరిహారం పంపిణీ మొదలైంది. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం, నిత్యావసరాల పంపిణీ పూర్తయింది. పంట నష్టం అంచనా వేసేందుకు అధికారుల బృందాలు కూడా పర్యటిస్తున్నాయి. ఈ దశలో ప్రతిపక్షనేతగా చంద్రబాబు కూడా పర్యటనలు మొదలు పెట్టారు. పరిహారం అందడంలేదని తీర్మానించేశారు. జగన్ ఎందుకు పరిహారం ఇవ్వరంటూ నిలదీస్తున్నారు, తాను అధికారంలోకి వచ్చాక పరిహారం ఇస్తానంటూ బింకాలు పలుకుతున్నారు. తుపాను రాజకీయాలు మొదలు పెట్టారు.

ఆ విషయంలో మాత్రం తేడా ఉంది..

చంద్రబాబు హయాంలో తుపానులు వస్తే వార్ రూమ్ లు, కాల్ సెంటర్లు అంటూ హడావిడి జరిగేది. జగన్ వచ్చాక అలాంటి అతి జరగడంలేదు, తుపాను ప్రభావం తగ్గాక, నష్టపరిహారం కూడా మొదలయ్యాక జగన్ పరామర్శకు వస్తున్నారు. అదే వారిద్దరికీ తేడా. చంద్రబాబులా జగన్ డప్పు కొట్టుకోవడంలేదు. అంతమాత్రాన ఏమీ జరగడంలేదని తీర్మానించేసి, మూడునెలల్లో తానే అధికారంలోకి వస్తానని చెప్పుకోవడం.. చంద్రబాబు మానసిక పరిస్థితిని తెలియజేస్తోందని వైసీపీ నుంచి సెటైర్లు పడుతున్నాయి.

First Published:  9 Dec 2023 2:14 AM GMT
Next Story