Telugu Global
Andhra Pradesh

మళ్ళీ వర్ల రామ‌య్యే బలిపశువా..?

రాబోయే ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేల‌కు టికెట్లు నిరాకరించారు జగన్. వాళ్ళతో టీడీపీ నేతలు టచ్ లోకి వెళ్ళారు. టికెట్లు దక్కదని ఖాయమైన వాళ్ళు కొలుసు పార్థ‌సారధి, రక్షణనిధి, ఆదిమూలం లాంటి వాళ్ళు టీడీపీలో చేరుతున్నారు.

మళ్ళీ వర్ల రామ‌య్యే బలిపశువా..?
X

గెలుపు అవకాశం లేదని తెలిసినా చంద్రబాబునాయుడు పోటీకి దింపాలంటే ఎస్సీ నేత వర్ల రామయ్యే గుర్తుకొస్తారు. గెలుపు గ్యారంటీ అన్నప్పుడు మాత్రం అగ్రవర్ణాలు నేతలు మాత్రమే గుర్తుకొస్తారు. ఇప్పుడు విషయం ఏమిటంటే.. రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ విడుదలచేసింది. ఏప్రిల్ 2వ తేదీతో ఏపీలోని ముగ్గురు రాజ్యసభ ఎంపీల కాలపరిమితి ముగుస్తోంది. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, టీడీపీ ఎంపీలు సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్ రిటైర్ అయిపోతున్నారు. ఈ స్ధానాలను భర్తీ చేసేందుకు ఎల‌క్ష‌న్ కమిషన్ సోమవారం షెడ్యూల్ విడుద‌ల చేసింది.

అసెంబ్లీలోని సంఖ్యాబలం ప్ర‌కారం చూసుకుంటే.. వైసీపీకే మూడుసీట్లు దక్కుతాయి. ఒక్కో ఎంపీకి 40 మంది ఎమ్మెల్యేలు ఓట్లేయాలి. ఈ లెక్కన వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో 120 మంది ఓట్లేస్తే చాలు ముగ్గురూ గెలిచినట్లే. అయితే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే రాబోయే ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేల‌కు టికెట్లు నిరాకరించారు జగన్. వాళ్ళతో టీడీపీ నేతలు టచ్ లోకి వెళ్ళారు. టికెట్లు దక్కదని ఖాయమైన వాళ్ళు కొలుసు పార్థ‌సారధి, రక్షణనిధి, ఆదిమూలం లాంటి వాళ్ళు టీడీపీలో చేరుతున్నారు. ఆల్రెడీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు నలుగురు టీడీపీలో చేరిపోయారు.

ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరగా కాపు రామచంద్రారెడ్డి చేరటానికి రెడీ అవుతున్నారు. అందుకనే ఓ 25 మందితో క్రాస్ ఓట్లు వేయించుకుని ఒక అభ్యర్థిని గెలిపించుకోవాలని చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎలాగూ ఒరిజినల్ టీడీపీ ఎమ్మెల్యేలు 19 మందున్నారు. ఎలాగూ టికెట్లు రావని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు ఇక వాళ్ళు అధికారపార్టీ అభ్యర్థులకు ఓట్లేయరని అందరూ అనుకుంటున్నదే.

అందుకనే వాళ్ళని టచ్ చేసే బాధ్యతను చంద్రబాబు కొందరు తమ్ముళ్ళకి అప్పగించారట. ఇప్పుడు తమ్ముళ్ళందరు అదే పనిలో ఉన్నారు. ఇక్కడ ట్విస్టు ఏమిటంటే.. ఇదే సమయంలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం రెబల్ ఎమ్మెల్యేల‌పై అనర్హత వేటు విషయంలో విచారణ జరుపుతున్నారు. వీళ్ళపైన స్పీకర్ గనుక వేటు వేస్తే టీడీపీ ఎంత ప్రయత్నించినా రాజ్యసభ ఎంపీని గెలుచుకునే అవకాశం ఉండదు. గెలుపు గ్యారంటీ లేనప్పుడేమో వర్ల పేరును పరిశీలిస్తారు. గెలుపు ఖాయమని అనుకున్నప్పుడు మాత్రం చంద్ర‌బాబుకు వర్ల రామ‌య్య‌ అస్సలు గుర్తుకురారు.

First Published:  30 Jan 2024 6:41 AM GMT
Next Story