Telugu Global
Andhra Pradesh

పోలవరాన్ని నాశనం చేసి ఇప్పుడు కన్నీళ్ళట

నిజానికి పోలవరం ప్రాజెక్టుకు ప్రస్తుత దుస్థితికి చంద్రబాబే కారణమని చెప్పాలి. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సిన ప్రాజెక్టును బలవంతంగా తన చేతుల్లోకి తీసుకున్నారు చంద్రబాబు. ఎందుకంటే కేవలం కమీషన్ల కక్కుర్తి కోసమనే చెప్పాలి.

పోలవరాన్ని నాశనం చేసి ఇప్పుడు కన్నీళ్ళట
X

మొసలి కన్నీళ్ళంటారే చంద్రబాబునాయుడు కన్నీళ్ళు అచ్చం అలాగే ఉంది. యుద్ధభేరి పేరుతో చంద్రబాబు ప్రాజెక్టులను సందర్శిస్తున్న విషయం తెలిసిందే. తన హయాంలో ఏమీచేయలేకపోయిన చంద్రబాబు ఇప్పుడు ఆ నెపాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తోసేస్తున్నారు. తనకున్న ఎల్లో మీడియా అపారమైన మద్దతు కారణంగా చంద్రబాబుకు విపరీతమైన ప్రచారం దక్కుతోంది. మిగిలిన ప్రాజెక్టుల సంగతి ఎలాగున్నా పోలవరం ప్రాజెక్టు విషయంలో ఈ విషయం స్పష్టంగా బయటపడింది. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తర్వాత దీని దుస్థితి చూస్తే కన్నీళ్ళు వస్తున్నట్లు చెప్పారు.

నిజానికి పోలవరం ప్రాజెక్టుకు ప్రస్తుత దుస్థితికి చంద్రబాబే కారణమని చెప్పాలి. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సిన ప్రాజెక్టును బలవంతంగా తన చేతుల్లోకి తీసుకున్నారు చంద్రబాబు. ఎందుకంటే కేవలం కమీషన్ల కక్కుర్తి కోసమనే చెప్పాలి. చంద్రబాబు చేతకానితనం వల్లే పోలవరం పూర్తి కాలేదని కేంద్రమంత్రిగా పనిచేసిన సుజనాచౌదరి లాంటి వాళ్ళు కూడా చెప్పారు. కాసులకు కక్కుర్తిపడి కాఫర్ డ్యాం నిర్మించకుండానే డయాఫ్రం వాల్ నిర్మించారు. దీనివల్ల భారీ వరదలు వచ్చిన కారణంగా డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది.

భారీ వరదలకు డయాఫ్రం వాల్ కొట్టుకుపోకుండా ముందుగా కాఫర్ డ్యాం నిర్మించాలి. కాఫర్ డ్యాం నీటి ప్రవాహ ఉధృతిని తగ్గిస్తుంది. అప్పుడు డయాఫ్రం వాల్ మీద ఒత్తిడి ఉండదు. కానీ చంద్రబాబు ముందు డయాఫ్రం వాల్ కట్టడమే తప్పు. డయాఫ్రం వాల్ దెబ్బతినటం వల్ల సుమారు రూ.2 వేల కోట్లు నష్టం జరగటంతో పాటు ఇంతవరకు పనులు జరగలేదు. దీనివల్ల కాఫర్ డ్యాం నిర్మాణం ఆలస్యమవుతోంది. దీన్ని నిర్మించింది ఎల్లో మీడియా యాజమాన్యం దగ్గరి బంధువుల సంస్థే.

కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ నిర్మాణంలో జాప్యం వల్లే మొత్తం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోంది. ఇక కీలకమైన పునరావాసాన్నే చంద్రబాబు పట్టించుకోలేదు. కేంద్రమే నిర్మించాల్సిన ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకోవటం మొదటి తప్పు. కాఫర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రంవాల్ నిర్మించటం రెండో తప్పు. వరదలకు డయాఫ్రం వాల్ కొట్టుకుపోతే దాన్ని సరిచేయటానికి ఇప్పుడు జగన్ ప్రభుత్వం నానా అవస్థ‌లు పడుతోంది. పునరావాసాన్ని పట్టించుకోకపోవటం మూడో తప్పు. అంటే ప్రాజెక్టును నాశనం చేసిన చంద్రబాబుకు ఇప్పుడు కన్నీళ్ళొస్తున్నాయంటే అవి మొసలి కన్నీళ్ళనే చెప్పాలి.

First Published:  8 Aug 2023 5:07 AM GMT
Next Story