Telugu Global
Andhra Pradesh

బాధితుల ముందు కూడా సొంత సోదేనా..?

45 ఏళ్ళుగా తాను ఒక్క తప్పుకూడా చేయలేదన్నారు. చేయని తప్పుకు తనను జైలులో పెట్టి మానసిక క్షోభకు గురిచేసినట్లు చెప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.

బాధితుల ముందు కూడా సొంత సోదేనా..?
X

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు వ్యవహారం చిత్ర‌ విచిత్రంగా ఉంది. ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో శుక్రవారం చంద్రబాబు పర్యటించారు. తుపాను బాధితులను పరామర్శించటానికి వెళ్లి.. తన సొంత సోది చెప్పుకున్నారు. తన సోదంతా వాళ్ళకి చెప్పి బాధితుల నుండే సానుభూతిని, ఓదార్పును కోరుకోవటమే విచిత్రంగా ఉంది. పంటలు దెబ్బతిన్నాయని చెప్పి రైతులను, బాధితులను ఓదార్చాల్సిన చంద్రబాబు ఆ పనిచేయలేదు. బాధితుల దగ్గరకు వెళ్ళి చేయని తప్పుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తనను అరెస్టు చేసినట్లు చెప్పుకున్నారు.

45 ఏళ్ళుగా తాను ఒక్క తప్పుకూడా చేయలేదన్నారు. చేయని తప్పుకు తనను జైలులో పెట్టి మానసిక క్షోభకు గురిచేసినట్లు చెప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్ర‌శ్నించినందుకే త‌నను తప్పుడు కేసులో ఇరికించి జైలులో ఉంచినట్లు ఆవేద‌న వ్యక్తంచేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. చేయని తప్పులో ఇరికించి జైలులో పెట్టడానికి ఇక్కడ ఉన్నది అమాయకుడు కాదు. దశాబ్దాలుగా అన్నీ వ్యవస్థ‌లను మ్యానేజ్ చేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు.

చంద్రబాబును ఎవరైనా కేసుల్లో ఇరికించగలరా..? కాకపోతే 45 ఏళ్ళుగా తాను ఒక తప్పు కూడా చేయలేదని చెప్పటం కాదు ఎక్కడా దొరకలేదని మంత్రులు ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు అత్యంత అవినీతిపరుడైన రాజకీయ నేతని, కాకపోతే ఇన్ని సంవత్సరాలు ఎక్కడా దొరక్కుండా జాగ్రత్తలు పడినట్లు ఎదురుదాడులు చేస్తున్నారు. వ్యవస్థ‌లను మ్యానేజ్ చేసుకుంటూ దొరలాగ తిరిగిన చంద్రబాబు పాపం పండి చివరకు సాక్ష్యాధారాలతో సహా దొరికినట్లు మంత్రి అంబటి రాంబాబు చెప్పిన విషయం తెలిసిందే.

ఏ తప్పు చేయకపోయినా చంద్రబాబును జైలులో పెట్టారని మామూలు జనాలు ఎవరు అనుకోవటంలేదు. ఎందుకంటే స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ప్రాథ‌మిక సాక్ష్యాధారాలున్నాయని ఏసీబీ కోర్టు జడ్జి అభిప్రాయపడ్డారు. అవినీతికి పాల్పడినట్లు ప్రాథ‌మిక ఆధారాలున్నాయి కాబట్టి రిమాండు విధిస్తున్నట్లు జడ్జి స్వయంగా చంద్రబాబుతోనే చెప్పారు. క్వాష్ పిటీషన్ దాఖలు చేస్తే హైకోర్టు జడ్జి డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే.

First Published:  9 Dec 2023 7:00 AM GMT
Next Story