Telugu Global
Andhra Pradesh

బెయిల్ సంతోషం కూడా దక్కనివ్వరా?

వ‌దినమ్మ పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వంలో రూ. 2 వేల కోట్ల అక్రమ తవ్వకాలు జరిగాయని ఆరోపించిన మరుసటి రోజే చంద్రబాబుతోపాటు మరో ముగ్గురిపై ఇసుక అక్రమ తవ్వకాల కేసులు నమోదవ్వటమే కొసమెరుపు.

బెయిల్ సంతోషం కూడా దక్కనివ్వరా?
X

బెయిల్ సంతోషం కూడా దక్కనివ్వరా?

మధ్యంతర బెయిల్ వచ్చిందన్న సంతోషం కూడా చంద్రబాబుకు మిగిలేట్లు లేదు. స్కిల్ స్కామ్‌లో అరెస్టయి 53 రోజులు రాజమండ్రి జైలులో గడిపిన తర్వాత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. స్కిల్ కేసు కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, అంగళ్ళ అల్లర్లు, అమరావతి అసైన్డ్ భూముల స్కామ్‌లో చంద్రబాబు మీద సీఐడీ కేసులు నమోదుచేసుంది. వీటిల్లో అరెస్టుకు వీలుగా దాదాపు ఏడు పీటీ వారెంట్లను కూడా జారీచేసింది.

ఈ కేసులన్నింటినీ చంద్రబాబు జైలులో ఉండగానే నమోదుచేసింది. ఇక బెయిల్ మీద బయటకు వస్తున్నారనగా మద్యం కుంభకోణం కేసు నమోదుచేసింది. తాజాగా ఇసుక అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదుపై మరో కేసు నమోదైంది. ఏపీఎండీసీ ఫిర్యాదుతో మాజీమంత్రి పీతల సుజాతను ఏ1గా, చంద్రబాబును ఏ2గా, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఏ3, మరో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఏ4గా సీఐడీ కేసులు నమోదుచేసింది. కేసుల మీద కేసుల నమోదుతో బెయిల్ దక్కిందన్న సంతోషం కూడా చంద్రబాబుకు దక్కేట్లు లేదు.

ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరిగాయనేందుకు ఆధారాలను కూడా ఏపీఎండీసీ ఫిర్యాదులో చెప్పింది. కరకట్ట మీద చంద్రబాబు ఇంటికి సమీపంలోనే కృష్ణానది గర్భంలో అక్రమంగా ఇసుకను తవ్వారని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ)కి ఫిర్యాదు అందింది. ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన ఎన్జీటీ నిజమే అని నిర్ధారించుకుని ప్రభుత్వానికి రూ.100 కోట్లు ఫైన్ వేసింది. అలాగే కృష్ణా-పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దు గ్రామంలో ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నారని అప్పటి ఎమ్మార్వో వనజాక్షి అడ్డుకున్నారు.

వెంటనే అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వచ్చి వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చి కొట్టిన ఘటన రాష్ట్రంలో సంచలనమైంది. అందరి ముందు చింతమనేని ఎమ్మార్వోను కొట్టిన తర్వాత స్వయంగా చంద్రబాబే పంచాయితీచేశారు. ఆ పంచాయితీలో వనజాక్షిదే తప్పని చంద్రబాబు తేల్చటం కలకలం రేపింది. రాష్ట్రంలోని చాలా నదులు, రేవలు సమీపంలో ఇసుకను యధేచ్చగా అక్రమంగా తవ్వేసుకున్నారనే ఆరోపణలకు కొదవేలేదు.

ఇవన్నీ ఒక ఎత్తయితే అప్పటిమంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ, ఎంతెంత పరిణామంలో ఇసుకను అక్రమంగా తవ్వుకుంటున్నారు, ఎంతెంత సంపాదిస్తున్నారని మ్యాప్‌లు వేసి జిల్లాలవారీ వివరాలను ఎల్లోమీడియానే సీరియల్‌గా అచ్చేసింది. దాని ప్రకారమైనా చంద్రబాబు హయాంలో వేలాది కోట్ల రూపాయల ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాని అనుకోవచ్చు. వ‌దినమ్మ పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వంలో రూ. 2 వేల కోట్ల అక్రమ తవ్వకాలు జరిగాయని ఆరోపించిన మరుసటి రోజే చంద్రబాబు తోపాటు మరో ముగ్గురిపై ఇసుక అక్రమ తవ్వకాల కేసులు నమోదవ్వటమే కొసమెరుపు.

First Published:  3 Nov 2023 4:06 AM GMT
Next Story