Telugu Global
Andhra Pradesh

పండగ పూట హెచ్చరిస్తున్న.. పెద్దిరెడ్డి!

పెద్దిరెడ్డిని తాను పండగ పూట హెచ్చరిస్తున్నానని ఇంతవరకు తనలో సున్నితత్వాన్ని చూశారు.. ఇకపై కఠినత్వం చూస్తారన్నారు. వడ్డీతో సహా అంతా తిరిగి చెల్లిస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

పండగ పూట హెచ్చరిస్తున్న.. పెద్దిరెడ్డి!
X

సంక్రాంతి సంబరాల కోసం సొంతూరు నారావారిపల్లెకు వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడ కూడా జగన్ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలకు దిగారు. మంత్రులకు వార్నింగ్ ఇచ్చారాయన. చిత్తూరు జిల్లాలో తనకు పెద్ద సవాల్‌గా మారిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రత్యేకంగా వార్నింగ్ ఇచ్చారు.

భోగి మంటల్లో జీవో - 1 ప్రతులను చంద్రబాబు తగలబెట్టారు. మంత్రుల తప్పులన్నింటిని తాను లెక్కిస్తున్నానని హెచ్చరించారు. ఎక్కడ దాక్కున్నా తప్పులు చేస్తున్న ఇప్పటి మంత్రులకు శిక్ష తప్పదన్నారు. తిరుమల వేదికగా అనేక అపచారాలు జరుగుతున్నాయన్నారు .

Advertisement

వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే ఆ ఫలితాన్ని ఈ జన్మలోని అనుభవిస్తారని వార్నింగ్ ఇచ్చారు. శ్రీవారి లడ్డు ప్రసాదం నాణ్యత తగ్గిపోయిందని... వ్యాపార ధోరణితోనే గదుల రేట్లు పెంచారని చంద్రబాబు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇటుకపై ఇటుక పేర్చి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజా వేదిక విధ్వంసంతోనే జగన్ విధ్వంసకర పాలన మొదలైందన్నారు. ఉగ్రవాదం తరహాలో జగన్ పాలన ఉందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ లేకుండా పోయాయన్నారు.

Advertisement

ప్రజలపై పన్నులు, చార్జీలు మోత మోగిస్తున్నారని విమర్శించారు. పిల్లల భవిష్యత్తును నాశనం చేసేలా జగన్ వ్యవహారం ఉందన్నారు. కందుకూరులో ప్రభుత్వమే కుట్ర చేసి తొక్కిసలాటకు కారణమైందని చంద్రబాబు ఆరోపించారు. గుంటూరు తొక్కిసలాట కుట్ర త్వరలోనే బయటకు వస్తుందన్నారు.

జన్మభూమి రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో అమరరాజా సంస్థ ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే.. దానిపైన కాలుష్యం పేరుతో లేనిపోని అభాండాలు వేసి తరిమేశారన్నారు. పెద్దిరెడ్డిని తాను పండగ పూట హెచ్చరిస్తున్నానని ఇంతవరకు తనలో సున్నితత్వాన్ని చూశారు.. ఇకపై కఠినత్వం చూస్తారన్నారు. వడ్డీతో సహా అంతా తిరిగి చెల్లిస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

పుంగనూరులో తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీవారిని పెద్దిరెడ్డి వేధిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలా గెలుస్తాడో తాను చూస్తానన్నారు. ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడ దాక్కుంటాడో కూడా చూస్తానన్నారు. పోలీసులు ఆత్మ విమర్శ చేసుకొని విధులు నిర్వహిస్తే మంచిదన్నారు. పుంగనూరే కాదు 175 నియోజకవర్గాల్లోనూ ఈసారి తెలుగుదేశం పార్టీ గెలవబోతోందన్నారు.

Next Story