Telugu Global
Andhra Pradesh

వైఎస్ఆర్‌పై వదిలిన అస్త్రాన్నే ఇప్పుడు జగన్‌పైకి.. చంద్రబాబు వ్యూహం సఫలమవుతుందా?

వైఎస్ఆర్‌పై వదిలిన అస్త్రాన్నే ఇప్పుడు జగన్‌పైకి.. చంద్రబాబు వ్యూహం సఫలమవుతుందా?
X

తెలుగుదేశం పార్టీని మరో సారి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొని రావాలని చంద్రబాబు టార్గెట్‌గా పెట్టుకున్నారు. 2024లో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పార్టీకి మాత్రమే కాకుండా తనకు కూడా వ్యక్తిగతంగా చాలా ప్రతిష్టాత్మకమైనవని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే వయసు మీద పడుతుండటం.. 2029 కల్లా తాను రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉంటానో ఉండనో అనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికీ టీడీపికి అసలైన వారసుడిగా నారా లోకేశ్ ఎదగలేదు. చంద్రబాబు పార్టీని నడపకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్న సీనియర్ నాయకుల నుంచి కార్యకర్తల వరకు ఉన్నది.

లోకేశ్‌ను ప్రజా నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడానికి 'యువ గళం' పేరుతో పాదయాత్ర ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని యువతను తెలుగుదేశానికి తిరిగి దగ్గర చేయడానికే ఈ యాత్ర చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, లోకేశ్ యాత్ర వల్ల తెలుగుదేశానికి మైలేజీ పెరిగి, గెలుస్తామనే నమ్మకం బాబులో పూర్తిగా లేదు. అందుకే పోల్ మేనేజ్‌మెంట్‌కు అవసరమైన పనులను మరో వైపు చంద్రబాబు స్వయాన భుజానికి ఎత్తుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తే తప్పకుండా అధికారంలోకి వస్తామని బాబు భావిస్తున్నారు. టీడీపీతో కలవడానికి జనసేన సుముఖంగా ఉన్నా.. బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం బాబు అంటేనే మండిపడుతున్నది. అయితే ఎన్నికల లోపు బీజేపీ తప్పకుండా తమతో జట్టు కడుతుందని బాబు అంచనా వేస్తున్నారు. ఇక 2009 ఎన్నికల్లో వైఎస్ఆర్‌ను ఓడించడానికి వదిలిన బాణాన్నే.. వైఎస్ జగన్ రెండో సారి ముఖ్యమంత్రి కాకుండా వాడుకోవాలని భావిస్తున్నారు.

వైఎస్ఆర్ 2009లో కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా బరిలోకి దింపారు. అప్పుడు చంద్రబాబు నాయుడు మహాకూటమి పేరుతో టీఆర్ఎస్, వామపక్షాలను ఒకటి చేసి బరిలోకి దిగారు. అప్పట్లో ప్రజారాజ్యం కూడా విడిగా పోటీ చేసింది. ఇంత చేసినా.. కాంగ్రెస్ పార్టీ గెలుపును అడ్డుకోలేకపోయారు. కానీ, 2004 కంటే 2009లో టీడీపీ సీట్లు మాత్రం పెరిగాయి. ఈ సారి వైఎస్ జగన్ రెండో సారి అధికారంలోకి రాకుండా ఉండటానికి మరో సారి మహాకూటమి వ్యూహాన్ని బయటకు తీస్తున్నారు. టీడీపీ, జనసేన, వామపక్షాలు, ఇతర చిన్నా చితకా పార్టీలతో సహా బీజేపీని కూడా ఒకే కూటమిలో ఉంచాలని భావిస్తున్నారు.

చంద్రబాబు భావిస్తున్న మహాకూటమిలో బీజేపీ, వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయా అనేది అనుమానమే. ఇక కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ.. ఇలా చిన్నా చితకా పార్టీలతో జట్టు కడుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా.. అప్పుడు వైఎస్ఆర్‌పై వేసిన వ్యూహం విఫలం అయ్యింది. మరో సారి అదే విఫల వ్యూహాన్ని చంద్రబాబు అనుసరించడం ఏంటని పార్టీలోనే చర్చ మొదలైంది. చంద్రబాబు తన నమ్మకస్తుడైన అచ్చెన్నాయుడిని ముందు పెట్టి అఖిలపక్షం నిర్వహించారు.

విజయవాడలో తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, జై భీమ్ భారత్ పార్టీ, జనసేన హాజరయ్యాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఈ సమావేశం జరిగినా.. దీని వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నట్లు తెలుస్తున్నది. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా సాధ్యమైనన్ని పార్టీలను ఒకే కూటమి కింద చేర్చాలని చంద్రబాబు భావిస్తున్నారు.

ఇప్పుడు వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మూడు రాజధానుల కాన్సెప్ట్ తప్పకుండా వారికి ఓట్లు పడేలా చేస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే పవన్ కల్యాణ్ చెప్పినట్లుగానే.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చకుండా చేస్తేనే వైసీపీని ఓడించగలమని చంద్రబాబు కూడా నమ్ముతున్నారు. జనసేనతో కలిసినా కాపుల ఓట్లు పూర్తిగా పడతాయని చంద్రబాబు అనుకోవడం లేదు. అందుకే ఇతర పార్టీలను కూడా కలుపుకొని పోవాలని భావిస్తున్నారు. అందుకే మహాకూటమి కాన్సెప్ట్‌ను మరోసారి తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తున్నది.

First Published:  28 Dec 2022 11:26 AM GMT
Next Story