Telugu Global
Andhra Pradesh

మహానాడు వేదికగా తప్పిదాన్ని ఒప్పుకుని చంద్రబాబు యూటర్న్..!

ఆర్టీసీ బస్‌లలో మహిళలకి ఉచిత ప్రయాణం కాన్సెప్ట్ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెరపైకి తీసుకురాగా.. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లోనూ ఆ వాగ్దానం వర్క్‌వుట్ అయ్యింది. దాంతో చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితం అంటూ ప్రామిస్ చేశారు.

మహానాడు వేదికగా తప్పిదాన్ని ఒప్పుకుని చంద్రబాబు యూటర్న్..!
X

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న టీడీపీ.. మహానాడు వేదికగా మొదటి విడత‌ మేనిఫెస్టోని విడుదల చేసింది. యువతని ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా టీడీపీ మేనిఫెస్టో ఉంది. అలానే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాల్ని కొనసాగిస్తామనే సంకేతాల్ని కూడా చంద్రబాబు ఆ మేనిఫెస్టో ద్వారా ఇచ్చారు. ఓవరాల్‌గా ‘పూర్‌ టు రిచ్‌’ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.

టీడీపీ తాజాగా విడుదల చేసిన మ్యానిఫెస్టోని చూస్తే.. చదువుకునే పిల్లలు ఉన్న తల్లులకు ఏటా రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. దీనికి తల్లికి వందనం అని పేరు పెట్టారు. కానీ, ఇది వైసీపీ ‘అమ్మ ఒడి’ పథకానికి కాపీ అని ఇట్టే తెలిసిపోతోంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం కూడా ప్రతి తల్లికి రూ.15 వేలు ఇస్తోంది. అయితే ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలానే ఎక్కువ మంది పిల్లల్ని కనాలనే ఉచిత సలహా కూడా ఇచ్చారు.

వాస్తవానికి అప్పట్లో ఈ చంద్రబాబే కుటుంబ నియంత్రణ పాటించాలని.. ఇంటికి ఒకరు చాలని పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడు అదే తన తప్పిదమైందని నిజాయితీగా ఒప్పుకుని.. పిల్లల్ని కనండి వారిని బాగా చదివించి దేశానికి సంపదగా ఇచ్చే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతేకాదు ఎంతమంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఇద్దరు పిల్లలకు మించి ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అనే చట్టాన్ని తీసుకురావడం పెద్ద తప్పిదంగా ఒప్పుకున్న చంద్రబాబు.. నష్టం వస్తుందని తెలిశాక సరిచేసే బాధ్యత తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ రెండు విషయాల్లో చంద్రబాబు బహిరంగంగానే యూటర్న్ తీసుకున్నారు.

ఆర్టీసీ బస్‌లలో మహిళలకి ఉచిత ప్రయాణం కాన్సెప్ట్ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెరపైకి తీసుకురాగా.. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లోనూ ఆ వాగ్దానం వర్క్‌వుట్ అయ్యింది. దాంతో చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితం అంటూ ప్రామిస్ చేశారు. అలానే ఫ్యామిలీకి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు.. 18 నుంచి 59 ఏళ్ల ఆడపడుచులకు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి నెలకు రూ.1,500 ఇస్తామని హామీ ఇచ్చారు. అలానే రైతుకి ఏడాదికి రూ.20 వేలు సాయం కూడా ప్రకటించారు. ఈ స్కీమ్స్ కూడా వైసీపీ ప్రభుత్వం నవరత్నాల్లోని వైఎస్సాఆర్ చేయూత, వైఎస్సాఆర్ రైతు భరోసా పథకాల్ని కాపీ కొట్టినట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. ఓవరాల్‌గా వైసీపీ పథకాల్ని కొనసాగిస్తామని టీడీపీ తొలివిడత‌ మేనిఫెస్టోలోనే సంకేతాల్ని ఇచ్చింది.

యువతని ఆకర్షించడమే లక్ష్యంగా ఓ రెండు వాగ్దానాల్ని టీడీపీ తన మేనిఫెస్టోలో ఉంచింది. నిరుద్యోగ యువతికి నెలకి రూ.3 వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తారట. అలానే 20 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయబోతున్నట్లు కూడా చంద్రబాబు ప్రకటించారు. వాస్తవానికి ఇదే చంద్రబాబు 2014లో ఇంటింటికీ ఓ ఉద్యోగం అని బాహాటంగా ప్రకటించారు. అలానే నిరుద్యోగ భృతి గురించి కూడా ప్రస్తావించారు. కానీ.. 2019 ఎన్నికలకి కేవలం కొన్ని నెలల ముందు మాత్రమే రూ.1000 నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేశారు. ఇప్పుడు ఆ భృతిని రూ.3వేలకు పెంచారు. అయితే ఇదే టీడీపీ అప్పట్లో వైసీపీ నవరత్నాలపై విమర్శలు గుప్పిస్తూ ప్రజల్ని సోమరపోతుల్ని చేస్తోందని.. ఇలానే ఉచితాలకి డబ్బుల్ని పంచితే ఏపీ మరో శ్రీలంక అవుతుందని విమర్శలు గుప్పించింది. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ ‘పూర్‌ టు రిచ్‌’ అంటూ కొత్త పల్లవి అందుకుందని వైసీపీ నేతలు అప్పుడే కౌంటర్లు స్టార్ట్ చేశారు.

First Published:  29 May 2023 5:11 AM GMT
Next Story