Telugu Global
Andhra Pradesh

కోడెల కుటుంబం ఔట్? చంద్రబాబు సక్సెస్

సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణను నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించటంతో కోడెల కుటుంబం కథ‌ ముగిసిందనే అనుకోవాలి. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ సాధించినట్లే..

కోడెల కుటుంబం ఔట్? చంద్రబాబు సక్సెస్
X

తెలుగుదేశం పార్టీతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబానికి అనుబంధం దాదాపు తెగిపోయినట్లే. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ సాధించినట్లే అనుకోవాలి. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణను నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించటంతో కోడెల కుటుంబం కథ‌ ముగిసిందనే అనుకోవాలి. 2014లో సత్తెనపల్లి నుండి గెలిచిన కోడెల అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. ఐదేళ్ళు స్పీకర్ కుర్చీని మ్యాగ్జిమమ్ వివాదాస్పదం చేసేశారు. అలాగే కొడుకు కోడెల శివరామ్, కూతురు విజయలక్ష్మి ఇద్దరు సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో అరాచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు.

వారసుల అరాచకాల గురించి వైసీపీ, మామూలు జనాలు చెప్పటం కాదు టీడీపీ నేతలే మొత్తుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవటంతో సత్తెనపల్లిలో కోడెల కూడా ఓడిపోయారు. అప్పటి నుండి మాజీ స్పీకర్‌ను చంద్రబాబు దూరంపెట్టేశారు. కొడుకు అరాచకాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పార్టీలో కోడెలకు వ్యతిరేకంగా నేతలంతా ఏకమయ్యారు. కోడెల పార్టీ ఆఫీసుకు వస్తే అక్కడున్న నేతలంతా వెళ్ళిపోయేవారు. పార్టీ కార్యక్రమాలకు కూడా పిలిచేవారు కాదు. ఒక రకంగా కోడెలను పార్టీతో పాటు సామాజికవర్గం కూడా బహిష్కరించిందనే చెప్పుకోవాలి.

తన బాధను చెప్పుకుందామని కోడెల ఎన్నిప్రయత్నాలు చేసినా చంద్రబాబు కలవటానికి ఇష్టపడలేదు. కోడెలను చంద్రబాబు దూరంపెట్టిన తర్వాత ఇక ఆయనతో ఎవరు మాట్లాడుతారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. కోడెల చనిపోయిన తర్వాత కొడుకు శివరామ్ పరిస్థితి కూడా దాదాపు అలాగే కంటిన్యూ అయ్యింది.

తాజాగా నియోజకవర్గం ఇన్‌చార్జిగా కన్నాను నియమించారు. ఇదే విషయమై శివరామ్ మాట్లాడుతూ.. గడచిన మూడేళ్ళుగా పార్టీలో తమను ఎవరూ పట్టించుకోలేదన్నారు. మాట్లాడేందుకు తమ కుటుంబానికి 5 నిమిషాలు కేటాయించమని ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు అవకాశమివ్వలేదన్నారు. తన తండ్రి నిర్మించిన పార్టీ ఆఫీసుకు నేతలు రావటం కూడా మానుకున్నట్లు మండిపోయారు. చంద్రబాబుతో పాటు నేతలు, క్యాడర్లో చాలామంది తమ కుటుంబాన్ని పట్టించుకోవటంలేదన్నారు. శివరామ్ మాటలు విన్నతర్వాత టీడీపీతో కోడెల కుటుంబానికి ఉన్న అనుబంధం తెగిపోయిందన్నది స్పష్టమవుతోంది.

First Published:  2 Jun 2023 5:18 AM GMT
Next Story