Telugu Global
Andhra Pradesh

'టిప్పర్ డ్రైవర్'.. వైసీపీ అభ్యర్థికి బాబు ఫ్రీ పబ్లిసిటీ

చంద్రబాబు ప్రచారంతో కాస్తో కూస్తో మైలేజీ పెరుగుతుందని ఆశించిన శింగనమల టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీకి కొత్త చిక్కు వచ్చిపడింది. బాబు పర్యటన తర్వాత ఆమె పేరు హైలైట్ కాకపోగా.. ప్రత్యర్థి వీరాంజనేయులు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు.

టిప్పర్ డ్రైవర్.. వైసీపీ అభ్యర్థికి బాబు ఫ్రీ పబ్లిసిటీ
X

శింగనమల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఓటమిని చంద్రబాబే ఖరారు చేశారా..?

ఆయన నోరు జారడం వల్ల అంత నష్టం జరుగుతోందా..?

'టిప్పర్ డ్రైవర్' కాస్తా ఎలక్షన్ విన్నర్ గా మారబోతున్నారా..?

ప్రస్తుతం ఏపీలో 'టిప్పర్ డ్రైవర్' అంశం హాట్ టాపిక్ గా మారింది. ఒక 'టిప్పర్ డ్రైవర్'కి సీటిచ్చారు జగన్ అంటూ చంద్రబాబు హేళనగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడా అభ్యర్థికి వరంలా మారాయి. ఆయనకు సోషల్ మీడియాలో ఎక్కడలేని ప్రచారం లభిస్తోంది. ఎవరా 'టిప్పర్ డ్రైవర్' అంటూ మిగతా నియోజకవర్గాల వారు కూడా ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు. బాబు వ్యాఖ్యలతో అనుకోకుండా శింగనమల వైసీపీ అభ్యర్థి రామాంజనేయులుకి ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది, ఆయనపై సింపతీ పెరిగింది.

శింగనమలలో సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని కాదని, వీరాంజనేయులు అనే సామాన్య వ్యక్తికి టికెట్ ఇచ్చారు సీఎం జగన్. ఎమ్మెల్యే పద్మావతి భర్త సాంబశివారెడ్డి వద్ద వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్నారని తెలుస్తోంది. తన భార్యకు అవకాశం లేకపోయినా.. తన అనుచరుడికి టికెట్ తెప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు సాంబశివారెడ్డి. అయితే ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం వీరాంజనేయులుకి టికెట్ ఇవ్వడంపై మండిపడుతోంది. వైసీపీ అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేస్తోంది. సరిగ్గా ఈ దశలో చంద్రబాబు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వీరాంజనేయులు ఉన్నత విద్యావంతుడైనా పరిస్థితుల ప్రభావంతో టిప్పర్ డ్రైవర్ గా మారారు. జీవనోపాధికోసం ఆయన చేస్తున్న పనిని చంద్రబాబు అవమానించడం సంచలనంగా మారింది. దీంతో సోషల్ మీడియాలో టిప్పర్ డ్రైవర్ కమ్ అభ్యర్థి వీరాంజనేయులు హైలైట్ అయ్యారు. అదే సమయంలో చంద్రబాబుపై ట్రోలింగ్ మొదలైంది. సీఎం జగన్ కూడా ఈ అంశంపై స్పందించడం, అటు టిప్పర్ డ్రైవర్లంతా వీరాంజనేయులికి మద్దతుగా మాట్లాడటంతో ఆయన సోషల్ మీడియా సెన్సేషన్ గా మారారు.

టీడీపీ అభ్యర్థికి తిప్పలు..

చంద్రబాబు తన నియోజకవర్గం వచ్చి ప్రచారం చేస్తే.. కాస్తో కూస్తో మైలేజీ పెరుగుతుందని అనుకున్న శింగనమల టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీకి ఇప్పుడు కొత్త చిక్కు వచ్చిపడింది. చంద్రబాబు పర్యటన తర్వాత ఆమె పేరు హైలైట్ కాకపోగా.. ప్రత్యర్థి వీరాంజనేయులు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. దీంతో ఆయనకు ఉచిత ప్రచారం లభించినట్టయింది. అదే సమయంలో ఆయన సొంత పార్టీలోని వైరి వర్గం కూడా ఇప్పుడు సైలెంట్ అయింది. ఒకరకంగా చంద్రబాబు పర్యటన శింగనమలలో టీడీపీ ప్రత్యర్థికి బ్రహ్మాండంగా కలిసొచ్చింది.

First Published:  1 April 2024 2:16 AM GMT
Next Story