Telugu Global
Andhra Pradesh

ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది –చంద్రబాబు

విభజన చట్టం వల్ల ఏపీకి జరిగిన నష్టం కంటే జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన నష్టమే ఎక్కువ అని అన్నారు. విధ్వంసకర చర్యలతో మళ్లీ కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు.

ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది –చంద్రబాబు
X

ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది –చంద్రబాబు

చాలా రోజుల తర్వాత చంద్రబాబు వైసీపీపై తీవ్రమైన విమర్శల దాడి చేశారు. సీఎం జగన్‌ ని, ఆ పార్టీ నేతలను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రెండుకళ్లు లాంటి అమరావతి, పోలవరంను జగన్ దెబ్బతీశారన్నారు.

అధికారంలోకి రాకముందు తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని, అమరావతే రాజధానిగా ఉంటుందని జగన్ చెప్పారని గుర్తు చేశారు చంద్రబాబు. టీడీపీకంటే మిన్నగా అమరావతిని అభివృద్ధి చేస్తామని కూడా చెప్పారన్నారు. అలాంటి జగన్ ఇప్పుడు మూడు రాజధానులంటూ ఊసరవెల్లిలా రంగులు మార్చారంటూ మండిపడ్డారు. ప్రజా జీవితం అంటే వారి దృష్టిలో చులకనైపోయిందన్నారు. ఓట్ల కోసం ఎన్నో అబద్దాలు చెప్పారని, చట్టానికి తూట్లు పెట్టారని, అధికారం లేదని తెలిసినా? రాజధానిపై చట్టం చేసే హక్కు శాసనసభకు ఉందని వాదించారని, రాజధానిపై చట్టం చేయడానికి వీలు లేదని హైకోర్టు స్పష్టం చేసినా చివరకు సుప్రీంకోర్టు మెట్లెక్కారని అన్నారు.

ఒక సైకో వల్ల రాష్ట్రం నాశనం కావటానికి వీల్లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. రాజధానుల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేసిన జగన్‌ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అమరావతి నిర్మాణం ముందుకు సాగి ఉంటే పన్నుల రూపేణా రాష్ట్రమంతటికీ ఆదాయం వచ్చి ఉండేదన్నారు. ప్రజావేదికతో ప్రారంభమైన అమరావతి విధ్వంసం ఇప్పుడు రోడ్లు తవ్వేసేదాకా వచ్చిందని విమర్శించారు. జగన్‌ మభ్య పెట్టడంలో దిట్ట, దోచుకోవటంలో అనకొండ అని ధ్వజమెత్తారు. పెట్టుబడులన్నీ తరిమేసిన తర్వాత ఏం ఒరగబెట్టడానికి విశాఖ వెళ్తున్నారని ప్రశ్నించారు. గంజాయి రాజధానిగా విశాఖను మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలవరం వైఫల్యం కూడా వారిదే..

పోలవరాన్ని నిర్వీర్యం చేసి గోదావరిలో ముంచేశారని అన్నారు చంద్రబాబు. రుషికొండకు కూడా బోడి గుండు కొట్టించిన ఘనుడు జగన్‌ అని విమర్శించారు. విభజన చట్టం వల్ల ఏపీకి జరిగిన నష్టం కంటే జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన నష్టమే ఎక్కువ అని అన్నారు. విధ్వంసకర చర్యల వల్ల మళ్లీ కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. రోజు గడిస్తే చాలన్నట్టుగా వైసీపీ ఎమ్మెల్యేలు బానిసల్లా బతుకుతున్నారని చెప్పారు.

First Published:  9 Feb 2023 3:55 PM GMT
Next Story