Telugu Global
Andhra Pradesh

టీడీపీలో వింత పరిస్థితి.. ఇంచార్జుల కోసం వెతుకులాట!

ఒకప్పుడు పార్టీ పదవుల కోసం కూడా టీడీపీలో భారీ డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు పిలిచి పదవి ఇస్తామన్నా సరే.. తీసుకోవడానికి జంకుతున్నారు.

టీడీపీలో వింత పరిస్థితి.. ఇంచార్జుల కోసం వెతుకులాట!
X

తెలుగుదేశం చరిత్రలో ఎన్నడూ చూడని సంక్షోభాన్ని ఇప్పుడు పార్టీ ఎదుర్కుంటోంది. ఉమ్మడి ఏపీకి 9 ఏళ్లు, విభజన అనంతరం 5 ఏళ్లు సీఎంగా పని చేసిన పార్టీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు పార్టీని నడిపించడం కూడా కష్టంగా మారినట్లు కనిపిస్తోంది. అధికార వైసీపీ ఏపీలో చాలా బలంగా ఉండటంతో.. టీడీపీకి గడ్డుకాలం నడుస్తోంది. 2024లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. తానే స్వయంగా జిల్లాల్లో పర్యటించడమే కాకుండా, ఇవే నా చివరి ఎన్నికలు.. గెలిపించండి ప్లీజ్ అంటూ సెంటిమెంట్ మాటలు చెబుతున్నారంటే.. పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉన్నది. రాష్ట్రంలో కూడా చెప్పుకోదగిన నాయకులు ఉన్నారు. అవసరం అయితే తమ గల్లా పెట్టెల్లోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టగలిగే అభిమానులు కూడా ఉన్నారు. కానీ నియోజకవర్గ స్థాయిలో పార్టీని నడిపించగలిగే నాయకులు మాత్రం కరువయ్యారు. ఒకప్పుడు పార్టీ పదవుల కోసం కూడా టీడీపీలో భారీ డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు పిలిచి పదవి ఇస్తామన్నా సరే.. తీసుకోవడానికి జంకుతున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను.. 35 నియోజకవర్గాలకు ఇంచార్జులు లేరు. పలు కారణాల వల్ల ఆ పదవులు భర్తీ చేయడం చంద్రబాబుకు కష్టంగా మారింది.

Advertisement

2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు. వాసుపల్లి గణేష్ (విశాఖ సౌత్), కరణం బలరామ కృష్ణమూర్తి (చీరాల), మద్దాలి గిరిధర రావు (గుంటూరు వెస్ట్), వల్లభనేని వంశీ (గన్నవరం) పార్టీకి దూరమై చాలా కాలం గడుస్తోంది. అంతే కాకుండా చాలా నియోజకవర్గాల్లో కీలకమైన టీడీపీ నేతలు వైసీపీలోకి వెళ్లిపోయారు. వాళ్లలో సెగ్మెంట్ ఇంచార్జులు కూడా ఉన్నారు. దీంతో దాదాపు 35 నియోజకవర్గాల్లో ఇంచార్జుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే వాటిని భర్తీ చేయడంలో చంద్రబాబు కష్టాలు పడుతున్నారు.

రాష్ట్రంలోని ఆ 35 నియోజకవర్గాల్లో వైసీపీ బలంగా ఉన్నది. దీంతో ఇంచార్జులుగా పదవి ఇస్తామని, తర్వాత టికెట్ కూడా వస్తుందని చెప్పినా ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నా.. వాళ్లకు పార్టీని నడిపించే సత్తా లేదని చంద్రబాబు పక్కన పెట్టారు. పార్టీ ఇంచార్జి పదవి ఇస్తే భారీగా ఖర్చు పెట్టాలని, ఎమ్మెల్యే టికెట్ వచ్చినా గెలవాలంటే జేబుకు చిల్లు పడటం ఖాయమని డిసైడ్ అయి ఆ పదవి తీసుకోవడానికి మరికొంత మంది వెనుకాడుతున్నారు.

నెల్లిమర్ల, విశాఖ సౌత్, కొవ్వూరు, సత్తెనపల్లి, నందికొట్కూరు, మడకశిర, సింగనమల, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాలకు ఇంచార్జులను నియమించలేదు. ప్రస్తుతానికి తాత్కాలిక ఇంచార్జులతోనే చంద్రబాబు మమ అనిపిస్తున్నారు. కానీ, ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఆ స్థానాల్లో పార్టీని దూకుడుగా నడిపించగల సత్తా ఉన్న నాయకుల కోసం ఎంత వెతికినా దొరకడం లేదు. ఇప్పటికే ఉన్న స్థానిక నేతలు అధికార వైసీపీకి ధీటుగా ఎదగడానికి ప్రయత్నాలు చేయకపోవడంతో టీడీపీ అక్కడ గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోంది. ప్రస్తుతానికి ఆయా నియోజకవర్గాల బాధ్యతలను జిల్లా పార్టీ అధ్యక్షులకు అప్పగించారు. కానీ వాళ్లు కూడా ఆ సెగ్మెంట్లపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి.

ఉండి, నర్సాపురం, చింతలపూడి, తిరువూరు, మైలవరం, గన్నవరం, గుడివాడ, గుంటూరు ఈస్ట్, సర్వేపల్లిలో ఇంచార్జుల నియామకం జరిగింది. అయితే ఇక్కడ అభ్యర్థుల ఎంపికపై మాత్రం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వీరిలో చాలా మంది ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తున్నది. ఈ సారి పోటీ చాలా టాఫ్‌గా ఉంటుందని, కేవలం అంగబలం మాత్రమే కాకుండా, అర్థబలం కూడా ఉండాలని వాళ్లు భావిస్తున్నారు. అక్కడ వైసీపీ బలంగా ఉండటంతో.. అనసవరంగా బరిలోకి దిగి ఓడిపోవడం ఎందుకని ముందే చేతులెత్తేస్తున్నారని పార్టీలో చర్చ జరగుతున్నది.

జనవరి నుంచి అభ్యర్థులను ప్రకటించాలని చంద్రబాబు భావించినట్లు తెలుస్తున్నది. అయితే ఇంచార్జులు లేని స్థానాలతో పాటు చాలా నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి నేతలు వెనకడుగు వేస్తున్నారు. వారి బదులు వేరొకరు ఆసక్తి చూపిస్తున్నా.. గెలుస్తారనే నమ్మకం చంద్రబాబుకు లేదు. దీంతో ఇప్పుడు సరైన ఇంచార్జుల కోసం చంద్రబాబు వెతుకులాట ప్రారంభించారు. వెంటనే ఇంచార్జులను నియమించకపోతే ఎన్నికల సమయంలోనే కాకుండా.. త్వరలో ప్రారంభం కానున్న నారా లోకేశ్ పాదయాత్రకు కూడా ఆటంకం కలుగుతుందని చంద్రబాబు ఆందోళనలో ఉన్నారు.

Next Story