Telugu Global
Andhra Pradesh

160 గ్యారెంటీ.. బాబు డాంబికాలు

వైనాట్ 175 అంటూ వైసీపీ ముందుకెళ్తుంటే.. వుయ్ విన్ 160 అంటూ చంద్రబాబు కొత్త ప్రచారం మొదలు పెట్టారు.

160 గ్యారెంటీ.. బాబు డాంబికాలు
X

2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన స్థానాలు 23. ఇప్పుడు పొత్తులో ఉన్న జనసేన, బీజేపీ స్కోర్ కలిపినా అది 24 దగ్గరే ఆగుతుంది. ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికలు, పలు నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో వైసీపీ క్లీన్ విక్టరీ టీడీపీని వణికించింది. కానీ ఇప్పుడు కూటమితో తమ బలం పెరిగిందని అనుకుంటున్నారు చంద్రబాబు. ఏకంగా 160 స్థానాలు గెలుస్తామని ధీమాగా చెబుతున్నారు. వైనాట్ 175 అంటూ వైసీపీ ముందుకెళ్తుంటే.. వుయ్ విన్ 160 అంటూ చంద్రబాబు కొత్త ప్రచారం మొదలు పెట్టారు.

ప్రతి సీటు, ప్రతి ఓటు ముఖ్యం..

టీడీపీ క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ స్థాయి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విభేదాలు పక్కన పెట్టి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వారికి సూచించారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ... ప్రతి సీటూ ముఖ్యమేనన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ గెలుపు చారిత్రక అవసరమన్న ఆయన, పోలింగ్‌ ముగిసేవరకు పార్టీ నేతలు, కార్యకర్తలు విశ్రమించకూడదన్నారు. ఏపీలో అభివృద్ధి పడిపోయిందని, ఏపీని మళ్లీ పైకి లేపడానికే మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు కార్యకర్తలకు తెలిపారాయన. మూడు పార్టీల పొత్తు జగన్‌ను ఓడించడానికి కాదని, రాష్ట్రాన్ని గెలిపించడానికని అన్నారు.

అంతా మన ఘనతే..

పాతికేళ్ల కిందటే ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా పనిచేసిందని గుర్తు చేశారు చంద్రబాబు. టీడీపీ హయాంలో కేంద్ర నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ రోజు గ్రామాల్లో కనిపిస్తున్న ప్రతి రోడ్డూ టీడీపీ హయాంలో వేసినదేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప స్వప్రయోజనాలు టీడీపీ ఆశించదని చెప్పారు. ఉన్నతాశయంతో మూడు పార్టీలు కలిసి పోటీచేస్తున్న విషయం దృష్టిలో ఉంచుకుని క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేయాలి ఉపదేశమిచ్చారు.

చంద్రబాబు ఉపదేశాలు బాగానే ఉన్నా.. క్షేత్ర స్థాయిలో మూడు పార్టీల కలయిక అసాధ్యం అంటున్నారు. మూడు పార్టీల కార్యకర్తలు చేతులు కలపడానికి పూర్తి స్థాయిలో ఇష్టపడటం లేదు. టికెట్ల పంచాయితీలో సీట్లు దక్కనివారంతా అసంతృప్తులుగా మిగిలిపోయారు. వైసీపీలో నియోజకవర్గానికి ఒకరిద్దరు అసంతృప్తులున్నా.. టీడీపీ,జనసేన, బీజేపీలో ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం ఐదారుగురు అసంతృప్తులుంటారు. వారంతా పార్టీకోసం చిత్తశుద్ధితో పనిచేస్తారని భావించలేం. ఒకవేళ వైసీపీకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇబ్బందిగా మారితే, కూటమికి మాత్రం పార్టీ వ్యతిరేక ఓటు మరింత ఇబ్బందిని తెచ్చిపెట్టడం ఖాయం అని తెలుస్తోంది.

First Published:  13 March 2024 2:19 AM GMT
Next Story