Telugu Global
Andhra Pradesh

జగన్ ప్రతిభను కేంద్రం గుర్తించింది.. చంద్రబాబు సెటైర్లు..

పార్లమెంటరీ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వి.మురళీధరన్ వేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

జగన్ ప్రతిభను కేంద్రం గుర్తించింది.. చంద్రబాబు సెటైర్లు..
X

జగన్ పాలనను కేంద్ర మంత్రులు సైతం గుర్తించారు. ప్రభుత్వంలోని ఉత్తమ పాలసీలు చూసో, బెస్ట్ రిజల్ట్ చూసో కాదు. మూడున్నరేళ్లుగా ప్రజలకు నరకం చూపుతున్న రోడ్లను చూసి.. అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు.

ఇటీవల కాలంలో ఏపీ బీజేపీ నేతలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నా, కేంద్రం నాయకత్వం పెద్దగా ఫోకస్ చేయలేదు. తొలిసారిగా కేంద్ర మంత్రి ఏపీ ప్రభుత్వ తీరుపై కాస్త ఘాటుగా స్పందించారు. ఏపీలో రోడ్ల దుస్థితి ఎలా ఉందో తెలుసుకోడానికి ఈ ప్రయాణం సరిపోతుంది అంటూ వీడియో పోస్ట్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వి.మురళీధరన్ వేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఏంటా ట్వీట్..?

షేమ్, షేమ్ అంటూ కేంద్ర మంత్రి ఏపీ ప్రభుత్వంపై ట్వీట్ వేశారు. అనకాపల్లి రోడ్ల దయనీయ పరిస్థితి చూడండి. ఇదీ జగన్ ప్రభుత్వ అభివృద్ధి నమూనా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈ రోడ్లపై ప్రయాణం ఒక శిక్ష లాంటిదని అన్నారాయన. ఏపీ ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలను విస్మరిస్తోందని మండిపడ్డారు. అనకాపల్లి నుండి అచ్యుతాపురం వరకు కేవలం 20 కిలోమీటర్ల దూరానికి గంటకు పైగా సమయం పట్టిందని చెప్పారు. షేమ్ షేమ్ అంటూ ట్వీట్ ముగించారు. ఈ ట్వీట్‌ని బేస్ చేసుకుని టీడీపీ రెచ్చిపోతోంది.

ఇన్నాళ్లూ ఏపీ రోడ్ల గురించి టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వస్తే, వెంటనే సాక్షి నుంచి కౌంటర్లు పడేవి. ఆ రోడ్లు బాగానే ఉన్నాయంటూ ఫొటోలు తీసి మరీ ప్రచురించేవారు. గతంలో జనసేన కూడా గుంతల రోడ్లపై పెద్ద యుద్ధమే చేసింది. అప్పట్లో తాత్కాలికంగా మట్టి వేసి రోడ్ల గుంతల్ని పూడ్చేశారు, మమ అనిపించారు. వైసీపీ నేతలే రోడ్ల విషయంలో అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త మెరుగుపడుతుందని అనుకున్నా.. ఇటీవల వర్షాలకు మళ్లీ సమస్య మొదటికొచ్చింది. మరమ్మతులు కుదరక మళ్లీ గుంతలు తేలాయి ఏపీ రోడ్లు. ఇప్పుడు కేంద్ర మంత్రి వేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. దాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు వేసిన ట్వీట్ కూడా హాట్ టాపిక్ అవుతోంది.

"జగన్ పాలనను కేంద్ర మంత్రులు సైతం గుర్తించారు. అయితే ప్రభుత్వంలోని ఉత్తమ పాలసీలు చూసో, బెస్ట్ రిజల్ట్ చూసో కాదు. ఏపీలో మూడున్నరేళ్లుగా ప్రజలకు నరకం చూపుతున్న రోడ్లను చూసి. వైసీపీ ప్రభుత్వానికి ఇది సిగ్గుగా అనిపించడం లేదా? రోడ్ల మరమ్మతులపై సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, ప్రజలు రోడ్డు దాటలేకపోతున్నారు. " అంటూ ఘాటుగా ట్విట్టర్లో బదులిచ్చారు చంద్రబాబు. జగన్ పాలనను కేంద్రం సైతం గుర్తించిందని కామెడీ చేశారు.

First Published:  17 Oct 2022 8:05 AM GMT
Next Story