Telugu Global
Andhra Pradesh

ప్రాజెక్ట్ లను పక్కనపెట్టి మధ్యలో 'బ్రో' ఎందుకు..?

ప్రజలకు ఎవరెవరు ఏమి చేశారు? ఎవరివల్ల నష్టం జరిగిందో తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం రూపొందించామని చెప్పారు చంద్రబాబు. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు.

ప్రాజెక్ట్ లను పక్కనపెట్టి మధ్యలో బ్రో ఎందుకు..?
X

సాగునీటి ప్రాజెక్ట్ ల గురించి తాను మాట్లాడుతుంటే, ఏపీ జలవనరుల శాఖ మంత్రి 'బ్రో' సినిమా కలెక్షన్లు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు. ప్రాజెక్ట్ ల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రంలో భాగంగా ఆయన కడప జిల్లా తిమ్మాపురంలో పర్యటించారు. ప్రజల్లో చైతన్యం కోసమే తానీ కార్యక్రమం చేపట్టానని చెప్పారు చంద్రబాబు.

ప్రజలకు ఎవరెవరు ఏమి చేశారు? ఎవరివల్ల నష్టం జరిగిందో తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం రూపొందించామని చెప్పారు చంద్రబాబు. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు. కడప జిల్లాకు పెద్ద అసెట్ గండికోట అని, గండికోటను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశానని, ఒంటిమిట్టను కూడా అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. ఎయిర్ పోర్టును ఆధునీకరించింది కూడా తానేనన్నారు చంద్రబాబు.


నదుల అనుసంధానం..

గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకోవచ్చని చెప్పారు చంద్రబాబు. అయితే తన హయాంలో అనుసంధానం కోసం ఎందుకు ప్రయత్నించలేదనే విషయాన్ని మాత్రం దాటవేశారు. రాయలసీమను రతనాల సీమ చేయడం కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తామన్నారు. తాను బాంబులకే భయపడలేదని, జగన్ కి ఎందుకు భయపడతానన్నారు. సీఎం జగన్ తన సొంత మనుషుల కాంట్రాక్టుల కోసం రూ. 5 వేల కోట్ల దోపిడీకి శ్రీకారం చుట్టారని విమర్శించారు. అవుకు తోటపల్లి దగ్గర ఐదేళ్లు టెండర్లు పిలవద్దని చెప్పిన జగన్ ని ఏమనాలన్నారు. పెద్దిరెడ్డికి ప్రాజెక్టులు కట్టబెడుతున్నారని, మంత్రులే కాంట్రాక్టర్ల అవతారమెత్తి దోచుకుంటున్నారని చెప్పారు. కర్నూలు ఎయిర్ పోర్టును తాను ప్రారంభం చేస్తే.. దాన్ని కొట్టివేసి సీఎం తన పేరు వేసుకున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు.

సోషల్ మీడియా వార్..

చంద్రబాబు పర్యటనకు జనం తండోపతండాలుగా వస్తున్నారని టీడీపీ సోషల్ మీడియా విభాగం ప్రచారం చేసుకుంటోంది. అదే సమయంలో ఆయన రోడ్ షోలో జనాలెవరూ లేరని వైసీపీ అనుకూల అకౌంట్లలో కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. రోడ్ షో వ్యవహారంపై సోషల్ మీడియాాలో రచ్చ జరుగుతోంది.

First Published:  2 Aug 2023 11:58 AM GMT
Next Story