Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు రిమాండ్ పొడిగింపు.. నిరాశలో టీడీపీ శ్రేణులు

చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగించాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు, రిమాండ్‌ ను రెండు వారాలు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

చంద్రబాబు రిమాండ్ పొడిగింపు.. నిరాశలో టీడీపీ శ్రేణులు
X

చంద్రబాబుకి ఇది మరో షాక్. రిమాండ్ ముగిసిన తర్వాత బెయిల్ పై ఆయన బయటకొస్తాడనుకుంటున్న టీడీపీ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. ఆయన రిమాండ్ ని పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈనెల 19 వరకు చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉండాల్సిందేనని తేలిపోయింది. ఈరోజుతో ఆయన రిమాండ్ ముగుస్తున్న సందర్భంలో ఆయన్ను వర్చువల్‌ గా జడ్జి ఎదుట హాజరుపరిచారు. అయితే జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగించాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు, రిమాండ్‌ ను రెండు వారాలు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా..

స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్, ఆయన్ను కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు వెల్లడించింది. ఈ రెండు పిటిషన్లపై రెండు రోజులపాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. రేపు మరోసారి కోర్టులో వాదనలు కొనసాగుతాయి.

ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల అప్డేట్..

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసులు కూడా చంద్రబాబుని వెంటాడుతున్నాయి. ఈ రెండు కేసుల్లో బెయిల్ పిటిషన్ల విచారణ వ్యవహారం ఏపీ హైకోర్టులో ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఇదివరకే తీర్పు రిజర్వ్ చేసింది. ఈరోజు ఫైబర్ నేట్ కేసు వ్యవహారంలో కూడా అదే జరిగింది. ఈ కేసులో కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని, రెండేళ్ల క్రితం కేసుపెట్టినా అప్పట్లో ఆయనకు నోటీసులు ఇవ్వలేదని, హఠాత్తుగా ఆయన పేరును చేర్చారని చంద్రబాబు తరపు న్యాయవాదులు తమ వాదన వినిపించారు. ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది.

First Published:  5 Oct 2023 1:05 PM GMT
Next Story