Telugu Global
Andhra Pradesh

మళ్లీ రెండు కళ్ల సిద్ధాంతం.. ఆర్-5 జోన్ పై చంద్రబాబు రాద్ధాంతం

అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని టీడీపీ సమర్థిస్తుందా లేదా అనే విషయంపై చంద్రబాబు సూటిగా స్పందించలేదు. అటు పేదలు, ఇటు రైతులు.. అంటూ రెండు కళ్ల సిద్ధాంతాన్నే మళ్లీ వల్లె వేశారు.

మళ్లీ రెండు కళ్ల సిద్ధాంతం.. ఆర్-5 జోన్ పై చంద్రబాబు రాద్ధాంతం
X

అమరావతిలోని ఆర్-5 జోన్ లో ఇతర ప్రాంతాలకు చెందిన నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విషయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్, పట్టాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. అదే స్పీడ్ లో ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి కావాలని ఆదేశించారు. మరోవైపు చంద్రబాబు మాత్రం సెంటు భూమి పంపిణీపై రాద్ధాంతం మొదలు పెట్టారు.

సెంటు భూమి పొందుతున్న పేదలు, ఆ విషయంలో రగిలిపోతున్న రైతులు.. ఇద్దర్నీ అనునయించేలా మాట్లాడారు చంద్రబాబు. పేదల్ని మోసగించే ప్రక్రియలో భాగంగానే వైసీపీ ప్రభుత్వం ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేసిందని అన్నారాయన. రైతులు, పేదలకు మధ్య గొడవలు సృష్టించేందుకే సీఎం జగన్‌ ఈ కుట్రకు తెరలేపారన్నారు.

మేమేం చేశామంటే..?

సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ లోనే 5 శాతం భూమిని పేదల గృహ నిర్మాణానికి తాము రిజర్వ్‌ చేశామని చెప్పారు చంద్రబాబు. 5వేల టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని టీడీపీ ప్రభుత్వం ప్రారంభించి అధికారంలో ఉండగానే 90శాతం పూర్తి చేసిందని వివరించారు. ఇప్పుడు ఆర్-5 జోన్ పేరుతో పేదల్ని వంచించటమే కాకుండా రైతులకు అన్యాయం చేస్తూ రెండు వర్గాల ప్రయోజనాలు దెబ్బతీసేలా వైసీపీ కుట్ర పన్నిందని చంద్రబాబు ఆరోపించారు.

అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని టీడీపీ సమర్థిస్తుందా లేదా అనే విషయంపై చంద్రబాబు సూటిగా స్పందించలేదు. అటు పేదలు, ఇటు రైతులు.. అంటూ రెండు కళ్ల సిద్ధాంతాన్నే మళ్లీ వల్లె వేశారు. పేదలకు పట్టాలివ్వొద్దు అని గట్టిగా చెబితే.. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఆ ఓట్లు ఎక్కడ లోకేష్ కి కాకుండా పోతాయోననే భయం చంద్రబాబులో ఉంది. అందుకే అటు లబ్ధిదారులను కష్టపెట్టకుండా, ఇటు రైతులను ఇబ్బంది పెట్టకుండా మాట్లాడాలనుకున్నారు. అయితే జగన్ మాత్రం ఈ విషయంలో పూర్తి క్రెడిట్ వైసీపీ ఖాతాలో వేసుకున్నారు. రైతులు నిష్టూరాలాడుతున్నా, కోర్టులకెక్కి అడ్డుకోవాలనుకున్నా.. తాను చేయాల్సింది చేస్తున్నారు.

First Published:  18 May 2023 2:41 PM GMT
Next Story