Telugu Global
Andhra Pradesh

తగ్గేదేలే.. చంద్రబాబు కూడా డైలాగ్ కొట్టారు

"పుష్ప సినిమాలో కొన్ని సన్నివేశాల్లో బ్యాక్‌ గ్రౌండ్‌ లో నా ఫొటో ఉంటుంది. ఆ సినిమాలో చూపించిన కాలంలో నేను సీఎంగా ఉన్నాననో.. లేదంటే ఎర్రచందనం స్మగ్లర్లను నేను కంట్రోల్‌ చేశాననో.. వాళ్లు నా ఫొటో పెట్టి ఉండొచ్చు. దానికే వైసీపీ వాళ్లు ఏడుస్తున్నారు" అని చెప్పుకున్నారు చంద్రబాబు.

తగ్గేదేలే.. చంద్రబాబు కూడా డైలాగ్ కొట్టారు
X

చంద్రయాన్-3 విజయవంతం తర్వాత ఓ టీవీ ఛానెల్ లో ఇక ఏపీలో కూడా చంద్రోదయమే, చంద్రమే, చంద్రబాబే అంటూ చెప్పిన డైలాగులు బాగా వైరల్ అయ్యాయి. వార్తలు చదివిన వ్యక్తి అత్యుత్సాహమే తప్ప అందులో చంద్రబాబు సెల్ఫ్ డబ్బా ఏదీ లేదని అన్నారు కొందరు. కానీ అంతలోనే చంద్రబాబు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయన చంద్రయాన్-3 ని టచ్ చేయలేదు కానీ పుష్ప సినిమాకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకోవడంపై మాత్రం తనదైన శైలిలో స్పందించారు.

నేనే.. నాదే ఆ ఫొటో

సెల్ ఫోన్ కనిపెట్టా, హైటెక్ సిటీ కట్టా, హైదరాబాద్ నిర్మించా అంటూ చంద్రబాబు చెప్పుకోవడం మరీ ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆయన వాలకం తెలిసినవాళ్లు పెద్దగా పట్టించుకోరు కానీ, చంద్రబాబుకి మతి స్థిమితం తప్పి ఇలా మాట్లాడుతుంటారని వైరి వర్గాలు కౌంటర్లిస్తుంటాయి. అయితే ఇప్పుడు నిజంగానే చంద్రబాబు విచిత్రంగా మాట్లాడారు. పుష్ప సినిమా అవార్డుపై స్పందించాల్సిన సందర్భంలో ఆ సినిమాలో కూడా తన ఫొటోని వాడుకున్నారని చెప్పుకొచ్చారు. అసలు ఆ సినిమాలో చంద్రబాబు ఫొటోకి, అవార్డుకి ఏమైనా సంబంధం ఉందా..? మరి చంద్రబాబు వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి.

నా ఫొటో చూస్తే వారికి కడుపుమంట..

పుష్ప హీరో అల్లు అర్జున్ కి అవార్డు వచ్చినందుకంటే, ఆ సినిమాలో తన ఫొటో వాడుకున్నారనే విషయంతో ఎక్కువ సంబర పడుతున్నారు చంద్రబాబు. "పుష్ప సినిమాలో కొన్ని సన్నివేశాల్లో బ్యాక్‌ గ్రౌండ్‌ లో నా ఫొటో ఉంటుంది. ఆ సినిమాలో చూపించిన కాలంలో నేను సీఎంగా ఉన్నాననో.. లేదంటే ఎర్రచందనం స్మగ్లర్లను నేను కంట్రోల్‌ చేశాననో.. వాళ్లు నా ఫొటో పెట్టి ఉండొచ్చు. దానికే వైసీపీ వాళ్లు ఏడుస్తున్నారు" అని చెప్పుకున్నారు చంద్రబాబు. ఈ సమాధానం విన్నవాళ్లకు మాత్రం బాబు ప్రచార యావ‌ ఏ స్థాయిలో ఉందో మరోసారి అర్థమైంది.

First Published:  26 Aug 2023 7:40 AM GMT
Next Story