Telugu Global
Andhra Pradesh

నీకో రూలు.. నాకో రూలా..? రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లిలో టీడీపీ కార్యాలయానికి వెళ్లనివ్వకుండా తనను అడ్డుకున్నారంటూ చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీకో రూలు.. నాకో రూలా..? రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు
X

అర్జంట్ గా కందుకూరు మచ్చ చెరిగిపోవాలి, ఆ తర్వాత గుంటూరు మచ్చ గుర్తు లేకుండా పోవాలి, ఈలోగా తనపై సింపతీ రావాలి. ఇదీ చంద్రబాబు ప్లాన్. ఈ ప్రణాళిక అమలులో పెట్టేందుకు వైసీపీ కూడా ఇతోధికంగా సహకరిస్తోంది. జీఓతో రోడ్ షోలు, ర్యాలీలు రద్దు చేశామని చెప్పడంతో ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. తన పర్యటనలను అడ్డుకుంటున్నారంటూ కుప్పంలో రచ్చ మొదలు పెట్టిన చంద్రబాబు, తొలిరోజు పాదయాత్రతో సరిపెట్టారు, ఆ తర్వాత పరామర్శ యాత్ర చేసి, ఇప్పుడు రోడ్డుపై బైఠాయించి ఇంకాస్త సంచలనం రేకెత్తించారు.

కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లిలో టీడీపీ కార్యాలయానికి వెళ్లనివ్వకుండా తనను అడ్డుకున్నారంటూ చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల వారు గుడిపల్లికి రాకుండా మూడు మార్గాలను మూసివేశారంటూ మండిపడ్డారు. పోలీసులు వైసీపీ హయాంలో బానిసలుగా బతుకుతున్నారని అన్నారు చంద్రబాబు. చట్టప్రకారం విధులు నిర్వర్తించాలని వారికి సూచించారు. తనని కుప్పం నుంచి పంపించేయాలని చూస్తున్నారని, కానీ తాను వెళ్లబోనని.. పోలీసుల్నే ఇక్కడినుంచి పంపించేస్తానని అన్నారు. జగన్ ని కూడా పంపించేస్తానని, వైసీపీని శాశ్వతంగా భూస్థాపితం చేసే వరకు తెలుగు ప్రజల తరఫున పోరాడతానన్నారు బాబు.

నీకో రూలు.. నాకో రూలా..?

"రాజమండ్రిలో సీఎం జగన్‌ మీటింగ్‌ పెట్టలేదా? రోడ్‌షో చేయలేదా? మీ పార్టీ నేతలు రోడ్ షోలు నిర్వహించలేదా? జగన్‌.. నీకో రూలు.. నాకో రూలా?" అంటూ ప్రశ్నించారు. పోలీసులు అన్ని పార్టీలను సమానంగా చూస్తే ప్రజలు సహకరిస్తారని, చట్టాన్ని ఉల్లంఘించినవారంతా దోషులేనని అన్నారు.

రోడ్ షో లకు నిబంధనలు అడ్డుగా ఉన్నాయని తెలిసి కూడా చంద్రబాబు కుప్పంలో ఓ వాహనం రెడీ చేసుకుని యాత్ర చేయాలనుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇప్పుడు సింపతీ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన రోడ్డుపై కూర్చుని హడావిడి చేశారని వైసీపీ విమర్శిస్తోంది.

First Published:  6 Jan 2023 9:51 AM GMT
Next Story