Telugu Global
Andhra Pradesh

వర్సిటీ గురించి మాట్లాడండి.. ఉచిత ప్రచారం పొందండి..

అవసరం వస్తే చంద్రబాబు ఎవర్నీ వదిలిపెట్టరని తేలిపోయింది. ఇక ఆయన అనుకూల మీడియా ఎందుకు వదిలిపెడుతుంది చెప్పండి. షర్మిలకు ఫస్ట్ పేజ్ కవరేజీ ఇచ్చేసింది.

వర్సిటీ గురించి మాట్లాడండి.. ఉచిత ప్రచారం పొందండి..
X

అయితే చంద్రబాబుని పొగడాలి, లేదా జగన్ ని తిట్టాలి. అలా అయితేనే ఏపీలో టీడీపీ అనుకూల మీడియా వారిని పట్టించుకుంటుంది. లేకపోతే ఎంత పెద్ద వార్తయినా వారి పేపర్లో లోపలి పేజీల్లో కూడా పడదు. అస్మదీయులెవరు, తస్మదీయులెవరు అనేది యాజమాన్యం నేరుగా చెప్పకపోయినా ఉద్యోగులకి అది కంఠా పాటం అయిపోతుంది. కానీ ఇప్పుడు ఈనాడు సహా మిగతా మీడియాలో కొంతమందికి ప్రముఖంగా ప్రచారం లభిస్తోంది. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టినప్పటినుంచి ఇప్పటి వరకూ ఆమె ఎప్పుడూ ఈనాడులో హైలెట్ కాలేదు. ఇప్పుడు తొలిసారిగా ఆమె ఫొటో బ్యానర్ ఐటమ్ లోకి వచ్చేసింది. కారణం ఆమె జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టడమే. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చే నిర్మయాన్ని షర్మిల తప్పుబట్టారు. ఎన్టీఆర్ ని అవమానిస్తే కోట్లమందిని అవమానించినట్టేనని అన్నారామె. చంద్రబాబు కూడా షర్మిల వ్యాఖ్యల్ని ప్రస్తావించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అవసరం వస్తే చంద్రబాబు ఎవర్నీ వదిలిపెట్టరని తేలిపోయింది. ఇక ఆయన అనుకూల మీడియా ఎందుకు వదిలిపెడుతుంది చెప్పండి. షర్మిలకు ఫస్ట్ పేజ్ కవరేజీ ఇచ్చేసింది.

ఏపీలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలకు దాదాపుగా ఎవరూ ప్రయారిటీ ఇవ్వరు. ఎక్కడో లోపలి పేజీల్లో ఎర్రచీమ కాలి చిటికెన వేలి గోరంత మేర వాటికి స్పేస్ ఇచ్చి న్యూస్ పేపర్లలో కవర్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గురించి మాట్లాడితే మాత్రం మాజీ ఎంపీ చింతా మోహన్ కి కూడా అదిరిపోయే ప్రచారం కల్పిస్తున్నారు. అందులోనూ కాంగ్రెస్ నేతగా ఉన్న చింతా మోహన్, అదే కాంగ్రెస్ కి జవసత్వాలు నింపిన వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శిస్తే ఇంకెందుకు ఊరుకుంటారు చెప్పండి. రాష్ట్రానికి, దేశానికి వైఎస్ఆర్ చేసిన సేవలేవీ లేవని అన్నారు చింతా మోహన్. అందుకే ఆయన్ని కూడా టీడీపీ అనుకూల మీడియా నెత్తికెత్తుకుంది.

షర్మిల, చింతా మోహనే కాదు.. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు వ్యవహారంలో ఏ గల్లీ స్థాయి నాయకుడు మాట్లాడినా టీడీపీ అనుకూల మీడియాకి అది మహా ప్రసాదం. ఫలానా నాయకుడు పేరు మార్పుని ఖండించారు, ఫలానా నాయకురాలు కూడా పేరు మార్చొద్దని అంటున్నారంటూ ప్రచారం కల్పిస్తున్నారు. అవసరం ఉన్నన్ని రోజులు, పేరు మార్పు వ్యవహారం హాట్ టాపిక్ గా ఉన్నన్ని రోజులు వీరంతా ఆయా మీడియా సంస్థలకి అత్యంత ముఖ్యులుగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

First Published:  24 Sep 2022 3:51 PM GMT
Next Story