Telugu Global
Andhra Pradesh

ఉత్తరాంధ్ర నుంచి పోటీకి బాబు సన్నాహాలు

చివరకు విశాఖ సిటీ పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక దాని నుంచి పోటీకి చంద్రబాబు మొగ్గుచూపుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ గాలిలోనూ ఈ నాలుగు స్థానాల్లో టీడీపీ గెలిచింది.

ఉత్తరాంధ్ర నుంచి పోటీకి బాబు సన్నాహాలు
X

చంద్రబాబు కుప్పంలో గెలుపుపై విశ్వాసం కోల్పోయారా..? ముందు జాగ్రత్తగా మరో స్థానాన్ని చూసుకుంటున్నారా..? ప్రముఖ ఆంగ్ల దినపత్రిక దీనిపై ఒక కథనం ప్రచురించింది. చంద్రబాబు కుప్పంతో పాటు ఈసారి ఉత్తరాంధ్ర నుంచి ఒక సురక్షితమైన స్థానంలో పోటీకి సిద్ధపడుతున్నారనేది కథనం.

ఇప్పటికే రెండుసార్లు సర్వేలు చేయించుకున్నారని ఆ పత్రిక చెబుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన నేపథ్యంలో ఏడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కుప్పంలో ఈసారి గెలుపుపై చంద్రబాబు ధీమాతో లేరంటోంది. రెండో స్థానంలో పోటీ కోసం విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఒక సురక్షితమైన స్థానాన్ని ఎంపిక చేయాల్సిందిగా తన మనుషులను చంద్రబాబు పురమాయించి రెండు సార్లు సర్వేలు చేయించుకున్నట్టు ఆ పత్రిక చెబుతోంది.

చివరకు విశాఖ సిటీ పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక దాని నుంచి పోటీకి చంద్రబాబు మొగ్గుచూపుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ గాలిలోనూ ఈ నాలుగు స్థానాల్లో టీడీపీ గెలిచింది. సర్వే సంస్థలు కూడా ఆ నాలుగు స్థానాల్లో ఏదో ఒక దాని నుంచి పోటీ చేయడం సురక్షితమని సూచించినట్టు ఆంగ్ల పత్రిక చెబుతోంది.

1989 నుంచి వరుసగా ఏడు సార్లు కుప్పం నుంచి చంద్రబాబు గెలుస్తూ వచ్చారు. ప్రచారానికి వెళ్లకపోయినా, చివరకు నామినేషన్‌ కూడా తన ప్రతినిధులే వేసినా చంద్రబాబు గెలుస్తూ వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కుప్పంపై ధీమా తగ్గింది. నాలుగేళ్లలో చంద్రబాబు ఏకంగా ఐదుసార్లు కుప్పంలో పర్యటనలు చేయడం, తొలిసారి కుప్పంలో ఇంటి నిర్మాణాన్ని కూడా ఆంగ్ల పత్రిక ప్రస్తావించింది.

ఈ కథనం ఆధారంగా వైసీపీ చంద్రబాబును టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. కుప్పంలో ఓటమి భయంతోనే చంద్రబాబు ఇలా రెండో స్థానంలో పోటీ చేస్తున్నారని, అది కూడా సురక్షితమైన స్థానాన్ని ఎంపిక చేసుకుని మరీ పోటీ చేయబోతున్నారని ఎద్దేవా చేస్తోంది.

First Published:  7 Sep 2023 10:23 AM GMT
Next Story